తుపాకీ కాల్పులతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది మరణించారు. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఓ ప్రైమరీ స్కూలులో గుర్తు తెలియని ఓ టీనేజర్ అయిన దుండగుడు కాల్పులు జరిపాడు. పాఠశాలలో ఉన్న 18 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.







టెక్సాస్ చరిత్రలోనే అతిపెద్ద కాల్పుల్లో ఇదొకటి అని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి 18 ఏళ్ల యువకుడని, కాల్పులు జరుపుతూ ఉవాల్డే ప్రాథమిక పాఠశాలలోకి ప్రవేశించాడని చెబుతున్నారు. ఎదురుగా వచ్చిన వారిపై విచ్చలవిడిగా బుల్లెట్లతో దాడి చేశాడని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి పేరు సాల్వడార్ రామోస్ అని అన్నారు.


అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. టెక్సాస్ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ టెక్సాస్ గవర్నర్‌తో మాట్లాడారు. అన్ని విధాలా సహాయం అందించాలని బిడెన్ గవర్నర్‌ను కోరారు. టెక్సాస్ కాల్పులపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఆత్మల్ని చీల్చడం లాంటిదే: బిడెన్
అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. ‘తల్లిదండ్రులు తమ పిల్లలను మళ్లీ చూడలేరు. ఇది ఆత్మను చీల్చడం లాంటిది. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని బిడెన్ అన్నారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికోసం ప్రార్థించారు. సంతాప సూచకంగా వైట్‌హౌస్‌లో జాతీయ జెండాను హాఫ్ మాస్ట్‌లో ఎగుర వేశారు. 










టెక్సాస్ చరిత్రలో అత్యంత భయానక కాల్పులు
టెక్సాస్ చరిత్రలో ఇది అత్యంత భయంకరమైన కాల్పులు. టెక్సాస్‌లోని ఉవాల్డే నగరంలో ఉన్న ఈ పాఠశాలలో 600 మంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాలలోకి ప్రవేశించిన 18 ఏళ్ల బాలుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దాడి చేసిన టీనేజర్ సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్ చదువుతున్న అమాయక పిల్లలను లక్ష్యంగా చేసుకున్నాడు. దాడి చేసిన షూటర్ కూడా హతమైనట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది.


అమెరికాలో గతంలో జరిగిన తుపాకీ కాల్పుల దాడులు ఇవీ



  • 2012- న్యూ టౌన్‌లోని శాండీ హుక్ స్కూల్‌పై దాడి, కాల్పుల్లో 26 మంది మృతి

  • 2016 - టెక్సాస్ ఆల్పైన్ స్కూల్ కాల్పుల్లో ఒక విద్యార్థి మరణించాడు

  • 2018- టెక్సాస్‌లోని సెయింట్ ఫే స్కూల్‌లో కాల్పులు, 17 ఏళ్ల బాలుడు కాల్పులు జరిపాడు, 10 మంది మరణించారు.

  • 2021 - టెక్సాస్‌లోని టింబర్‌వ్యూ స్కూల్‌లో కాల్పులు, కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.

  • 2022 - టెక్సాస్ ప్రాథమిక పాఠశాలలో కాల్పులు, 14 మంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు మరణించారు, 18 ఏళ్ల నిందితుడైన వ్యక్తిని హతమార్చారు.