Blast in Switzerland Resort : కొత్త ఏడాది వేడుకల వేళ స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని ప్రముఖ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్-మోంటానా లోని ఒక బార్‌లో జరిగిన పేలుడు ఘటనలో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
స్విట్జర్లాండ్‌లోని విలాసవంతమైన స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్-మోంటానాలో జనవరి 1, 2026 తెల్లవారుజామున సుమారు 1:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో కిక్కిరిసిపోయిన లే కాన్‌స్టెలేషన్ అనే ప్రసిద్ధ బార్ అండ్ లాంజ్‌లో కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంటుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి క్షణాల్లో మంటలు బార్ అంతటా వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ 100 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో భవనం పూర్తిగా పొగతో నిండిపోయింది. బయటకు వచ్చే దారి కనిపించక, ఊపిరాడక చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 40 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను తరలించేందుకు ఎయిర్-గ్లేసియర్స్ హెలికాప్టర్లు , భారీ సంఖ్యలో అంబులెన్స్‌లను రంగంలోకి దింపారు.
ఈ పేలుడుకు గల కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, నూతన సంవత్సర వేడుకల కోసం ఏర్పాటు చేసిన బాణసంచా లో ఏదైనా లోపం తలెత్తి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. వాలిస్ కాంటోన్ పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్రాన్స్-మోంటానా గగనతలంపై నో ఫ్లై జోన్ విధించి దర్యాప్తును వేగవంతం చేశారు. మృతుల కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ మరియు రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఇది ఉగ్రవాద దాడి కాదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడుగానే ప్రస్తుతానికి అధికారులు భావిస్తున్నారు.