Indian man sells samosas on London train: ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఆహారపదార్ధాలు సహజంగానే అమ్ముతూ ఉంటారు. లండన్ రైళ్లలో సాధారణంగా శాండ్‌విచ్‌లు, కాఫీలు అమ్ముతారు. కానీ, ఒక భారతీయ వ్యక్తి ఏకంగా వేడివేడి సమోసాలను అమ్ముతూ హడావుడి చేస్తున్నాడు. లండన్ అండర్‌గ్రౌండ్ రైలు లో ఆ యువకుడు సమోసాలు అమ్ముతున్న వీడియో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి పెద్ద ట్రేలో సమోసాలను ఉంచుకుని రైలులోని బోగీల్లో తిరుగుతూ విక్రయిస్తున్నాడు. సమోసా.. సమోసా.. వన్ పౌండ్ అంటూ ఆయన పిలుస్తున్న తీరు ముంబై లేదా ఢిల్లీ రైల్వే స్టేషన్లను గుర్తుకు తెస్తోంది. విదేశీ గడ్డపై, ముఖ్యంగా లండన్ లాంటి నగరంలో ఇలాంటి దృశ్యం కనిపించడం అక్కడి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యక్తి బీహార్ నుంచి లండన్ వెళ్లి అక్కడ హోటల్ పెట్టుకుని ఉపాధి పొందుతున్నట్లుగా గుర్తించారు.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. "భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ సంస్కృతిని, రుచులను వదిలిపెట్టరు అని కొందరు ప్రశంసిస్తుంటే.. లండన్ ట్యూబ్ ఇప్పుడు దాదర్ స్టేషన్‌లా మారిపోయింది అని మరికొందరు జోకులు పేలుస్తున్నారు. మరికొందరైతే దీనితో పాటు కాస్త అల్లం టీ కూడా ఉంటే బాగుండేది అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కొంత మంది నెగెటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ జీవనోపాధి కోసం వినూత్న మార్గాలను వెతుక్కుంటున్నారు. లండన్‌లో భారతీయ చిరుతిళ్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. హోటళ్లకు వెళ్లి తినే సమయం లేని ప్రయాణికులకు, ఇలా ప్రయాణంలోనే స్వదేశీ రుచులు అందుబాటులోకి రావడం ఒక రకంగా వారికి వెసులుబాటుగా మారింది. అయితే, లండన్ రవాణా నిబంధనల ప్రకారం రైళ్లలో ఇలాంటి అమ్మకాలకు అనుమతి ఉంటుందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.