Iran economic situation deteriorates: ఆయిల్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న దేశమైనప్పటికీ, ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. డిసెంబర్ 2025 చివరి వారం నుండి టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.    ఇరాన్ నేడు అత్యంత దారుణమైన కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ  రియాల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందియ ఒక డాలర్‌కు సుమారు 14.2 లక్షల రియాల్స్‌కు పైగా చెల్లించాల్సి వస్తోంది.  ఈ కరెన్సీ పతనం కారణంగా ద్రవ్యోల్బణం 42 శాతానికి పైగా పెరిగింది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువులు, ఆహారం, మందుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, గత ఏడాదితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు 70 శాతానికి పైగా పెరగడం ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది.

Continues below advertisement

పెరిగిన ధరలు , వ్యాపారం చేయడం అసాధ్యంగా మారడంతో టెహ్రాన్‌లోని చారిత్రాత్మక  గ్రాండ్ బజార్  వ్యాపారులు తమ షాపులను మూసివేసి నిరసన బాట పట్టారు. తొలుత మొబైల్ మార్కెట్లు, చిన్న వ్యాపారులతో మొదలైన ఈ ఆందోళనలు, క్రమంగా విద్యార్థులు, కార్మికులు , సాధారణ పౌరులకు విస్తరించాయి. టెహ్రాన్ వీధుల్లో ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఇజ్రాయెల్‌తో ఇటీవలి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఆంక్షల  వల్ల పరిస్థితి మరింత విషమించింది. పెట్రోలియం ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ ఇరాన్ ఈ స్థితికి చేరడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికా , ఇతర పశ్చిమ దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాలపై విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలు. దీనివల్ల ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్లో స్వేచ్ఛగా చమురు అమ్ముకోలేకపోతోంది. రెండు, దేశీయ వనరుల నిర్వహణలో వైఫల్యం,  హమాస్, హిజ్బుల్లా వంటి విదేశీ గ్రూపులకు ఇచ్చే భారీ ఆర్థిక మద్దతు వల్ల ఇరాన్ పరిస్థితి మరింత దిగజారింది.  మాకు గాజా వద్దు.. లెబనాన్ వద్దు.. మా దేశాన్ని కాపాడండి అంటూ నిరసనకారులు చేస్తున్న నినాదాలు ప్రజల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి.     

 నిరసనలు ఉధృతం కావడంతో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే, మరోవైపు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ను మార్చడం వంటి చర్యలతో మార్కెట్లను శాంతింపజేసే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇంధన , నీటి కొరత కూడా తోడవడంతో ప్రజల ఆగ్రహం తగ్గడం లేదు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరలను అదుపు చేయకపోతే, ఈ నిరసనలు మరింత తీవ్రమై రాజకీయ అస్థిరతకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.