Switzerland Ban On Burqas: స్విడ్జర్లాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడంపై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన బిల్లును బుధవారం స్విట్జర్లాండ్ పార్లమెంటు దిగువ సభ ఆమోదించింది. ఇప్పటికే ఎగువ సభ ఆమోదించింది. నేషనల్ కౌన్సిల్‌లో ఈ చట్టానికి అనుకూలంగా 151 ఓట్లు, వ్యతిరేకుంగా 29 ఓట్లు వచ్చాయి. జనాదరణ పొందిన మితవాద, స్విస్ పీపుల్స్ పార్టీ దీనిని ఆమోదించింది. మధ్యేవాదులు, గ్రీన్స్ వ్యతిరేకించినా మెజారిటీ సభ్యులు ఆమోదంతో బిల్లు సులభంగా పాస్ అయ్యింది. 


కళ్ల మాత్రమే కనిపించే దస్తులు, బురఖాలు, నిరసనకారులు ధరించే స్కీ మాస్క్‌ల నిషేధంపై స్విస్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం సేకరించింది. ఎక్కువ శాతం మంది స్విస్ ఓటర్లు నిషేధించడాన్ని ఆమోదించారు. దిగువ సభ ఓటుతో బిల్లు చట్టంగా మారింది. దీనిని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 1,000 ఫ్రాంక్‌ల వరకు (సుమారు $1,100) జరిమానా విధించే అవకాశం ఉంది.


బహిరంగ స్థలాలు, సామాజిక సమూహాలు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రైవేట్ భవనాల్లో ముక్కు, నోరు, కళ్లను కవర్ చేస్తూ ధరించే దుస్తులపై నిషేధం ఉంటుంది. రెండు స్విస్ ఖండాలు దక్షిణ టిసినో, ఉత్తర సెయింట్ గాలెన్ ఇప్పటికే ఇలాంటి చట్టాలను అమలు చేస్తున్నాయి. బెల్జియం, ఫ్రాన్స్, తరువాత ఇలాంటి చట్టాలను అమలు చేసిన దేశంగా స్విట్జర్లాండ్‌ నిలిచింది.


2016లోనే దక్షిణ టిసినోలో నిషేధం
స్విట్జర్లాండ్‌లోని దక్షిణ టిసినోలో ముఖం కనిపించకుండా బురఖా ధరించడాన్ని 2016లోనే స్థానిక ప్రభుత్వం నిషేధించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది. కనిష్టంగా 7,800 రూపాయలను, గరిష్టంగా 7.85లక్షల రూపాయల జరిమానా విధిస్తూ చట్టం తీసుకొచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాల్లో ఎవరూ ముఖం కనిపించకుండా బురఖా ధరించకూడదని 2016 జూలై ఒకటవ తేదీ నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. లుగానో, లొకార్నో, మగదినో, బెల్లింజోన, మెండ్రిసియో ప్రాంతాల్లో ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి.


బురఖాను నిషేధించే విషయమై 2013లోనే టిసినో ప్రభుత్వం రెఫరెండమ్ నిర్వహించింది. మూడింట రెండు వంతుల మంది ఓటర్లు నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. బురఖాలు, నిఖాబ్‌లతో పాటు ప్రదర్శనల సందర్భంగా ఆందోళకారులు ముఖాలకు గుడ్డలు కట్టుకోవడాన్ని నిషేధించాలని టిసినో ప్రభుత్వం భావించింది. అయితే బురఖాలు, నిఖాబ్‌లు నిషేధిస్తే చాలని ప్రజలు తీర్పు చెప్పారు. ఇలా ఓ రాష్ట్రం బురఖాను నిషేధిస్తూ చట్టం తీసుకరావడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఏమీ కాదని కూడా స్విట్జర్లాండ్ పార్లమెంట్ స్పష్టం చేసింది. 


ఫ్రాన్స్‌లో నిషేధం
పాఠశాలల్లో ఇస్లామిక్ అబాయా దుస్తులను నిషేధిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం గత ఆగస్టు నెలలో సంచలన నిర్ణయం తీసుకుంది. లౌకిక చట్టాలను ఉల్లంఘించడాన్ని ఉటంకిస్తూ త్వరలో పాఠశాలల్లో అబయా దుస్తులు నిషేధించనున్నట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరానికి ముందు పాఠశాల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు, నియమాలను అందజేస్తామని దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్  చెప్పారు.


కొంతమంది ముస్లిం విద్యార్థులు అబాయా దుస్తులు ధరించి రావడంతో పాఠశాలల్లో లౌకిక చట్టాలకు ఉల్లంఘటన ఏర్పడుతోందన్నారు. వాటిని నివారించడానికి ఈ నిర్ణయ తీసుకున్నట్లు గాబ్రియేల్ చెప్పారు. ఇకపై పాఠశాలలో అబాయా ధరించడం సాధ్యం కాదని, సెప్టెంబర్ 4 నుంచి దేశవ్యాప్తంగా తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలకు జాతీయ స్థాయిలో స్పష్టమైన నియమాలు., ఆదేశాలు ఇస్తామని చెప్పారు.