India Canada Tension: 


కెనడాలో ఉద్రిక్తతలు


కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిజ్జర్ హత్య విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉద్ధృతమవుతున్నాయి. ఇప్పటికే కెనడా రాయబారిపై భారత్ నిషేధం విధించింది. అటు కెనడా కూడా భారత రాయబారిని నిషేధించింది. రోజురోజుకీ వివాదం ముదురుతుండడం వల్ల భారత్ అప్రమత్తమైంది. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. భారత్‌కి వెళ్లే వాళ్లపై ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది కెనడా. ఇప్పుడు భారత విదేశాంగ శాఖ కెనడాలోని భారతీయుల కోసం అడ్వైజరీ జారీ చేసింది. రాజకీయ కక్షతో కొందరు హింసను ప్రేరేపిస్తున్నారని వెల్లడించింది. ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు స్పష్టం చేసింది. కెనడాలోని భారతీయ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. దాదాపు ఏడాదిగా అక్కడ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. పలు హిందూ ఆలయాలపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడులు చేస్తున్నారు. 


"కెనడాలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ కక్షతో కొందరు హింసకు పాల్పడుతున్నారు. ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విద్యార్థులు ఒట్టావాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అవ్వండి. లేదంటే టొర్నటోలోని కాన్సులేట్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోండి. అలా అయితేనే అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించగలం. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించండి"


- భారత విదేశాంగ శాఖ