India Pakistan Ceasefire | తమ ప్రభుత్వం భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న హింసను ఆపడంలో భాగంగా కాల్పుల విరమణ, యుద్ధవిరామానికి రాజీ కుదర్చడంలో తాము సక్సెస్ అయ్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ పాలన సమయంలో సిరియాపై విధించిన దీర్ఘకాలిక అమెరికా ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
"నా గొప్ప ఆశయం ఏంటంటే.. గొప్ప శాంతికర్తగా, దేశాల ఐకమత్యకర్తగా ఉండటం. నాకు యుద్ధం ఇష్టం లేదు... నేను మూడు వారాల్లో ISIS ని ధ్వంసం చేశాను. నాలుగైదేళ్లు పడుతుందని ప్రజలు భావించారు. కానీ కేవలం 3 వారాల్లో పని పూర్తి చేశామని" డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
"కొన్ని రోజుల కిందట అమెరికా ప్రభుత్వం భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న హింసను ఆపడానికి చారిత్రాత్మక యుద్ధవిరామానికి విజయవంతంగా మధ్యవర్తిత్వం చేసింది. నేను పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాను. మీ దేశాలతో ఒప్పందం చేసుకుంటాం. వ్యాపారం చేద్దామని వారికి చెప్పాను. అణ్వాయుధాలతో డీల్ చేయకూడదు. మీరు తయారుచేసే వస్తువులతో బిజినెస్ చేద్దాం. మీరు చాలా శక్తివంతమైన నాయకులు. అదే విధంగా వ్యవహరించాలని సూచించానని" అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ, దాడుల విరమణకు మధ్యవర్తిత్వం చేయడంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోను చేసిన ప్రయత్నాలను కూడా ట్రంప్ ప్రశంసించారు. ’ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లను డిన్నర్‌కు ఆహ్వానించాను. వారితో చాలా విషయాలు డీల్ చేయాలి. మార్కో రూబియోను చూస్తే గర్వంగా ఉంది. మార్కో లేచి నిలబడండి, మీరు ఎంత గొప్ప పని చేశారో మీకు తెలియదు. JD వాన్స్‌కు ధన్యవాదాలు. భారత్, పాక్ అధినేతలతో కలిసి మార్కో రూబియో బయటకు వెళ్లి కలిసి మంచి భోజనం చేయవచ్చు," అని ట్రంప్ అన్నారు. .
అమెరికా అధ్యక్షుడు చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. వారు శత్రుత్వాలను ముగించుకుంటే అమెరికా వారితో చాలా వ్యాపారం చేస్తుందని దక్షిణ ఆసియా దేశాలకు చెప్పానన్నారు. భారతదేశం, పాకిస్తాన్ల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ (DGMOs) అన్ని కాల్పులను, అన్ని రకాల సైనిక దాడులను వెంటనే ఆపేందుకు ఒక అవగాహనకు వచ్చారని న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకానీ మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పేర్కొన్నారు.
కాగా, భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఫలించింది. ఇరుదేశాల అధినేతలు తమ సూచన మేరకు కాల్పుల విమరణ, దాడుల విరామానికి అంగీకరించారని డొనాల్డ్ ట్రంప్ మే 10న ప్రకటించడం తెలిసిందే. ఇరు దేశాలు సమ్మతిస్తే కాశ్మీర్ అంశంపై సైతం తాను మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చూపిస్తానని మరుసటి రోజు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.