Stability AI CEO: ఏఐ, కృత్రిమ మేధ, చాట్ జీపీటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే పదాలు వినిపిస్తున్నాయి. వీటి గురించే చర్చ జరుగుతోంది. చాట్ జీపీటీ రాకతో ఆర్టిఫిషీయిల్ ఇంటెలిజెన్స్ పై జోరుగా చర్చ సాగుతోంది. ఏ విషయం గురించి అయినా అడిగితే సంక్షిప్తంగా, సవివరంగా, ఆకట్టుకునే హెడ్డింగ్స్ తో సమాచారాన్ని అందించడం, ఏదైనా విషయాన్ని క్లుప్తంగా వివరించడం, అలాగే కష్టతరమైన ప్రోగ్రామింగ్ క్వశ్చన్లకు కూడా సమాధానాలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ రాకతో చాలా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన మొదటి నుంచి ఉన్నదే. అన్ని రంగాల్లో ఏఐ వాడకం పెరిగిపోయి చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారన్న భయాందోళనలు ఇప్పటికే ఉన్నాయి. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనులను ఏఐ టూల్స్ తో చేయనుండటంతో వాటి అభివృద్ధిని అడ్డుకోవాలంటూ ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రోగ్రామర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతుందని సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. అయితే తాజాగా స్టెబిలిటీ ఏఐ సీఈవో చెప్పిన జోస్యం ఇప్పుడు ప్రోగ్రామర్లనూ భయపెడుతోంది. 


భవిష్యత్తులో ప్రోగ్రామర్ల అవసరం ఉండదు


స్టెబిలిటీ ఏఐ సీఈవో ఎమాడ్ మోస్టాక్, పీటర్ హెచ్.డయామాండితో కలిసి మున్షాట్స్ అండ్ మైండ్సెట్ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో మనుషులు ప్రోగ్రామ్ ను డిజైన్ చేయాల్సిన అవసరం లేదని ఎమాడ్ మోస్టాక్ చెప్పుకొచ్చారు. చాట్ జీపీటీ లాంటి ఏఐ ఆధారిత టూల్స్ స్వయంగా కోడింగ్ ను రూపొందిస్తున్నాయని, టెక్ రంగానికి కావాల్సిన కోడ్ లను ప్రామాణికంగా, మరింత కచ్చితత్వంతో అందించేందుకు అవే సహాయపడతాయని అన్నారు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు జనరేటివ్ ఏఐ సైతం తనదైన ముద్ర వేస్తుందని చెప్పుకొచ్చారు. 


గిట్‌హబ్‌లో 41 శాతం కోడ్‌లు చాట్ జీపీటీవే


ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ గిట్ హబ్‌లో 41 శాతం కోడ్ లు చాట్ జీపీటీ తయారు చేసినవేనని.. ఐదేళ్లలో ప్రోగ్రామర్ల అవసరం ఉండదని స్టెబిలిటీ ఏఐ సీఈవో అన్నారు. దీంతో పాటు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో బేసిక్ ప్రోగ్రామర్లకు ముప్పు ఎక్కువగా పొంచి ఉందని చెప్పారు. వాళ్ల అవసరం రాబోయే కొద్ది రోజుల్లో ఉండబోదని షాకిచ్చారు. 


Also Read: Good Study Habits: చదివింది ఒంటబట్టాలంటే ఈ 10 చిట్కాలు పాటించండి


2024 ముగిసే నాటికి ఫోన్లలోకి చాట్ జీపీటీ


2024 సంవత్సరం ముగిసే నాటికి అందరి ఫోన్లలోకి చాట్ జీపీటీ అందుబాటులోకి వస్తుందని ఆయన అంచనా వేశారు. అంతే కాదు దీన్ని వినియోగించాలంటే ఇంటర్నెట్ కూడా అవసరం లేదన్నారు. ఇంటర్నెట్ లేకుండా కావాల్సిన కార్యకలాపాలన్నీ చాట్ జీపీటీతో పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూడాలంటూ స్టెబిలిటీ ఏఐ సీఈవో చెప్పుకొచ్చారు. అలాగే హెల్త్, సైన్స్ నిపుణులకు ఏఐ టూల్స్ ను అందుబాటులో ఉంచాలని, వాటి ద్వారా ఆయా రంగాల నిపుణులు మరింత కచ్చితత్వంతో, వేగంగా పని చేయగలుగుతారని అన్నారు. 


అన్ని రంగాలకు ఏఐని అందుబాటులో ఉంచాలి


ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను అందరూ వినియోగించుకునేలా చూడాలని స్టెబిలిటీ ఏఐ సీఈవో ఎమాడ్ వ్యాఖ్యానించారు. ఆడియో, వీడియో, డీఎన్ఏ, కెమికల్ రియాక్షన్స్, లాంగ్వేజ్ ఇలా అన్ని ఇంటిగ్రేటెడ్ సొసైటీ ఓఎస్ అనే ఒకే పద్ధతి ఆధారంగా తమ సంస్థ ఓ మోడల్ ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial