Sri Lanka Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ మరో అడుగు ముందుకేసింది. భారత దౌత్యవేత్త గురువారం శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రితో చర్చలు జరిపారు. భారత్ ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల రుణాలు, ఇతర సాయం అందించింది. తాజాగా మరింత సాయం అందించేందుకు శ్రీలంకకు భారత్ సూచనలు ఇచ్చింది. శ్రీలంక ఏడు దశాబ్దాలలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, ఔషధాలతో సహా నిత్యావసరాల దిగుమతికి విదేశీ మారకద్రవ్యం కొరత ఏర్పడింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీప దేశం
ద్వీప దేశమైన శ్రీలంక 22 మిలియన్ల మంది ప్రజలకు ప్రాథమిక అవసరాలను తీర్చడానికి రాబోయే ఆరు నెలల్లో సుమారు 5 బిలియన్లు డాలర్లు కావాల్సి ఉంది. శ్రీలంకలో ఎక్కడ చూసిన పొడవాటి క్యూలు దర్శనం ఇస్తున్నాయి. విద్యుత్ కోతలు మరింత తీవ్రం అయ్యాయి. భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలతో చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, కనెక్టివిటీ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంకకు సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో తెలిపారు. విక్రమసింఘే, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో భారత బృందం ప్రత్యేకంగా సమావేశమైందని ప్రధాని కార్యాలయ అధికారి తెలిపారు.
ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల సాయం
"దేశంలోని ఆర్థిక పరిస్థితి, స్వల్పకాలిక దీర్ఘకాలిక సహాయ అవసరాలపై భారత ప్రతినిధి బృందం సీనియర్ అధికారులతో చర్చిస్తుంది" అని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం శ్రీలంకకు విదేశీ సహాయానికి భారతదేశం ప్రధాన వనరుగా ఉంది. 4 బిలియన్ల డాలర్లకు పైగా సాయం అందించిందని ప్రధాని విక్రమసింఘే పార్లమెంటుకు చెప్పారు.
ఐఎమ్ఎఫ్ తో చర్చలు
ఇంధనం కోసం 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌తో సహా అదనపు మద్దతు కోసం పొరుగుదేశాలతో చర్చలు జరుపుతున్నట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఆహార సంక్షోభాన్ని నివారించడానికి శ్రీలంక ప్రయత్నిస్తున్నందున ఎరువులు, బియ్యం దిగుమతికి సాయం అందిస్తామని భారత దౌత్య అధికారులు తెలిపారు. 3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు కొనసాగిస్తున్నందున, చైనా, భారత్, జపాన్‌లతో సదస్సు నిర్వహించాలని యోచిస్తున్నామని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే చెప్పారు.