అలాంటివి ఇక్కడ కుదరవు-ఖతార్ సర్కార్ 


ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఖతార్‌లో జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లనూ ఘనంగా చేస్తోంది అక్కడి ప్రభుత్వం. సాధారణంగానే ఈ దేశంలో నిబంధనలు కాస్త కఠినంగా ఉంటాయ్. వాటిని ఉల్లంఘించిన వారిపైనా కఠిన చర్యలే తీసుకుంటారు. మరీ ముఖ్యంగా సామాజిక పరంగా సున్నితమైన అంశాలుగా భావించే హోమో సెక్సువల్, ఎల్‌జీబీటీక్యూ లాంటి వాటిపైనా కాస్త స్ట్రిక్ట్‌గానే ఉంటుంది ఖతార్ సర్కార్. ఇలాంటి చర్యలు చేయటం మానవ హక్కుల ఉల్లంఘన అని చాలా కచ్చితంగా తేల్చి చెబుతుంది. ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో చాలా కఠిన నిబంధనలు పాస్ చేసింది ప్రభుత్వం. ఈ మ్యాచ్‌లు జరిగినన్ని రోజులు వన్ నైట్ స్టాండ్‌ అంటూ ఎవరైనా కమిట్ అయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. 


నిబంధనలు ఫాలో కాకపోతే జైలు శిక్ష తప్పదు..


నవంబర్‌లో వరల్డ్ కప్‌ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. మొదటి రోజు నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఫుట్ బాల్ గేమ్ నిర్వాహకులు స్పష్టం చేశారు. భార్యాభర్తలు కాకుండా మరెవరు శృంగారంలో పాల్గొన్నట్టు తెలిసినా, కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. నిజానికి ఐరోపా దేశాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ పూర్తయ్యాక పార్టీలు, వన్‌ నైట్ స్టాండ్‌లు చాలా కామన్. ఇవేవీ ఖతార్‌లో కుదరవు అని ప్రభుత్వం కచ్చితంగా చెప్పేస్తోంది. ఈ మ్యాచ్‌లు చూసేందుకు ఖతార్‌కు వచ్చే విదేశీ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కూడా ఈ రూల్స్‌కి కట్టుబడి ఉండాలని అంటోంది. పార్టీలు చేసుకోవటం ముమ్మాటికీ అంగీకరించమని చెబుతోంది. జైలు శిక్ష అనుభవించాలి అనుకునే వాళ్లు మాత్రమే ఇలాంటి పనులు చేయండంటూ ఘాటుగా హెచ్చరికలు చేసింది ఖతార్ ప్రభుత్వం. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామని చెప్పటం కొసమెరుపు.