Snowfall In Saudi Arabia | సౌదీ అరేబియాలో వింత పరిస్థితి నెలకొంది. అక్కడి ఎడారి ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. దాదాపు 30 ఏళ్ల తరువాత అక్కడ అలాంటి వాతావరణం కనిపించింది. కొన్నిచోట్ల వర్షాలు సైతం కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆకస్మిక వాతావరణ మార్పు వల్ల, ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయని చెబుతున్నారు. విపరీతమైన వేడి, విశాలమైన ఎడారులకు సౌదీ అరేబియా ప్రసిద్ధి చెందింది. కానీ ఈసారి అక్కడ విపరీతమైన చలి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. అనేక ప్రాంతాలలో మంచు కురిసింది.
కారణం ఇదే..
సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. రియాద్, ఖాసింలలో వాన ప్రభావం చూపింది. ఉత్తర, మధ్య ప్రాంతాల్లోకి చల్లని గాలులు ప్రవేశించడం వల్ల ఈ మార్పులు సంభవించాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎడారి ప్రాంతాల్లో తరచూ మంచు కురవడం వంటి అసాధారణ వాతావరణ మార్పులు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు (Climate Change) నిదర్శనమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎడారి దేశంలో ఆకస్మికంగా చలి పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీనివల్ల తబూక్ ప్రావిన్స్‌లోని పర్వతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. జెబెల్ అల్ లాజ్ ప్రాంతంలో, ట్రోజెనా అనే సుమారు 2600 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో తేలికపాటి వర్షం, మంచు కురిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సున్నా డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
అరేబియాలోని హాయిల్ నగరం సహా అనేక ప్రాంతాలలో మంచు కురిసింది. ఇక్కడ ఉదయం ఉష్ణోగ్రత 0 డిగ్రీలకు పడిపోయింది. దీనివల్ల ఎత్తైన ప్రదేశాలలో మంచు గడ్డకట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చల్లని గాలులతో పాటు అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అల్ అయనా, అమ్మర్, అల్ ఉలా గవర్నరేట్, షక్వా, దాని పరిసర ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది. ఈ ప్రాంతాలతో పాటు, రియాద్, ఖాసిమ్, తూర్పు ప్రాంతాలలోని కొన్ని భాగాలలో భారీ వర్షం కురిసింది.
ఆకస్మిక ఉష్ణోగ్రత పడిపోవడానికి కారణం ఏమిటి?
నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) ప్రకారం, రియాద్‌కు ఉత్తరాన ఉన్న అల్ మజ్మా, అల్ ఘాట్ ప్రాంతాలలో మంచు కురిసింది. ఈ ఎత్తైన ప్రదేశాలలో అసాధారణ వాతావరణం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వైరల్ అవుతున్నాయి. అన్ని పాఠశాలలను వారం రోజుల పాటు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, చల్లని గాలులు అధికంగా వీచడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, వాతావరణం ఆకస్మికంగా ఎందుకు మారిందనే ప్రశ్న తలెత్తింది. ఎప్పుడూ పొడిగా, వేడి ప్రాంతాలుగా ఉండే చోట్ల మంచు కురుస్తోంది. దీంతో, వాతావరణ మార్పు, దాని ప్రభావంపై కొత్త చర్చ మొదలైంది.
ప్రపంచంలోని ఈ ప్రాంతాలలో అసాధారణ మార్పులుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఆకస్మికంగా మంచు కురవడం, శీతాకాలపు వర్షాలు వాతావరణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దక్షిణ ఆసియాలో రికార్డు స్థాయిలో వేడి, మధ్య-ప్రాచ్య ప్రాంతాలలో ఆకస్మిక వరదలు, యూరప్- ఉత్తర ఆఫ్రికాలోని కొన్నిచోట్ల అసాధారణంగా మంచు కురవడం లాంటివి ప్రపంచంలో మరోసారి వాతావరణ మార్పులపై చర్చను రేకెత్తించాయి.