Russia is developing new weapon to target Elon Musk Starlink satellites: ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఒకటి భూమివైపు దూసుకు వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎలాన్ మస్క్ కు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. అందులో ఒకటి స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా ఒక అత్యాధునిక రహస్య ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని పాశ్చాత్య నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఉక్రెయిన్ దళాలకు స్టార్‌లింక్ శాటిలైట్లు వెన్నెముకగా నిలుస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమైనా, స్టార్‌లింక్ ద్వారా ఉక్రెయిన్ సైన్యం ఇంటర్నెట్ సేవలను పొందుతూ డ్రోన్ దాడులు, సమన్వయం ,సమాచార మార్పిడిని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇది రష్యాకు పెద్ద తలనెప్పిగా మారింది. అందుకే, ఈ శాటిలైట్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు రష్యా టోబోల్' (Tobol) వంటి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ లేదా అంతరిక్ష ఆధారిత శక్తివంతమైన రేడియేషన్ ఆయుధాలను ప్రయోగించాలని చూస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
అమెరికా నిఘా వర్గాల తాజా అంచనాల ప్రకారం.. రష్యా అంతరిక్షంలో ఒక అణు నిరోధక ఆయుధాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఇది నేరుగా ఉపగ్రహాలను పేల్చివేయడానికి కాకుండా, అంతరిక్షంలో భారీ స్థాయిలో విద్యుదయస్కాంత తరంగాలను సృష్టించడానికి ఉపయోగిస్తారు. ఈ తరంగాలు స్టార్‌లింక్ వంటి చిన్న శాటిలైట్ల ఎలక్ట్రానిక్ వ్యవస్థలను పూర్తిగా స్తంభింపజేస్తాయి. ఒకవేళ రష్యా ఈ పని చేస్తే వేస్తే, అది అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల ఉల్లంఘన కావడమే కాకుండా ప్రపంచవ్యాప్త కమ్యూనికేషన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
స్టార్‌లింక్ నెట్‌వర్క్ వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలతో ఉంటుంది. ఒకటి లేదా రెండు ఉపగ్రహాలను కూల్చివేయడం వల్ల ఈ వ్యవస్థకు పెద్దగా నష్టం జరగదు. కానీ రష్యా అభివృద్ధి చేస్తున్న కొత్త ఆయుధం మొత్తం సమూహాన్ని ఏకకాలంలో దెబ్బతీసే సామర్థ్యం కలిగి ఉందని నిఘా నివేదికలు చెబుతున్నాయి. రష్యా తన స్టార్‌లింక్ సేవలను జామర్ల ద్వారా అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అయితే తమ టీమ్ నిరంతరం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల ద్వారా ఆ దాడులను తిప్పికొడుతోందని గతంలోనే తెలిపారు.
అంతరిక్షంలో ఆయుధాల పోటీ పెరగడం పట్ల ఐక్యరాజ్యసమితి , ఇతర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా ఈ కొత్త ఆయుధాన్ని విజయవంతంగా మోహరిస్తే, అది కేవలం ఉక్రెయిన్‌కే కాకుండా ఇతర దేశాల నిఘా , నెట్‌వర్కింగ్ ఉపగ్రహాలకు కూడా ముప్పుగా మారుతుంది.