Italy Silvio Berlusconi: ఇటలీకి సుదీర్ఘకాలం పాటు పాలించి తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోని. ఆయన ఇటీవలె కన్నుమూసిన సంగతి తెలిసిందే. వేలాది కోట్లకు అధిపతి అయిన సిల్వియో.. చనిపోకముందు రాసిన వీలునామా అంశం తాజాగా వైరల్ అవుతోంది. ఈ వీలునామాను ఇటీవల మీడియా సమక్షంలో సిల్వియో వారసులకు చదివి వినిపించగా.. అందులో ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి రాగా.. అది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. సిల్వియో తన ప్రేయసి కోసం ఏకంగా రూ. 900 కోట్లకు పైగా ఆస్తిని రాసిచ్చారు. 


53 ఏళ్ల వ్యత్యాసం, అయినా చిగురించిన ప్రేమ


సిల్వియో బెర్లుస్కోని 86 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. సిల్వియో 33 ఏళ్ల మార్టా ఫాసినా అనే మహిళతో రిలేషన్‌షిప్‌ లో ఉన్నారు. 2020 మొదలైన వీరిద్దరి మధ్య బంధం.. ఆయన కన్నుమూసే వరకు కొనసాగింది. ఇద్దరి మధ్య వయస్సులో దాదాపు 53 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మార్టా ఫాసినాను సిల్వియో చట్ట ప్రకారం వివాహం చేసుకోలేదు కానీ.. ఆమెను తన భార్యగా చెప్పేవారు. అలా తన వీలునామాలో ఫాసినా కోసం ఏకంగా 100 మిలియన్ యూరోల ఆస్తిని రాసిచ్చారు. మన భారత కరెన్సీలో చెప్పుకోవాలంటే ఏకంగా రూ. 905 కోట్లు. మార్టా ఫాసినా కూడా రాజకీయ నాయకురాలే. ఆమె ఇటలీ పార్లమెంట్ దిగువ ఛాంబర్ లో 2018 నుంచి సభ్యురాలిగా ఉంటున్నారు. సిల్వియో స్థాపించిన ఫోర్జా ఇటాలియీ పార్టీలోనూ ఆమె సభ్యురాలిగా ఉంటూ వస్తున్నారు. 


పెద్ద కుమారుడు, కుమార్తె చేతుల్లోకి వ్యాపారం


సిల్వియో బెర్లుస్కోని ఆస్తి విలువ దాదాపు 6 బిలియన్ యూరోలకు పైమాటే అంటే రూ.54 వేల కోట్లకు పైనే. మీడియా టైకూన్ గా, వ్యాపారవేత్తగా, రాజకీయ నేతగా సిల్వియో పేరుపొందారు. సిల్వియో చట్టప్రకారం ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నారు. మరో ఇద్దరిని పెళ్లి చేసుకోకుండానే రిలేషన్‌షిప్ లో ఉన్నారు. సిల్వియోకు మొత్తం ఐదుగురు సంతానం. సిల్వియో మరణం తర్వాత ఆయన వ్యాపారాలను పెద్ద కుమార్తె మారినా, పెద్ద కుమారుడు పీర్ సిల్వియో చూసుకుంటున్నారు. సిల్వియో వ్యాపారాల్లో ఎగ్జిక్యూటివ్ పదవుల్లో వీరు కొనసాగుతున్నారు. ఫిన్ ఇన్వెస్ట్ ఫ్యామిలీ హోల్డింగ్ లో వీరికి 53 శాతం వాటాలు ఉన్నాయి. 


సోదరికి 100 మిలియన్ యూరోలు, మిగతాదంతా పిల్లలకే..


సిల్వియో వీలునామాను ఇటీవల తన ఐదుగురు పిల్లలు, ఇతర సాక్ష్యుల సమక్షంలో న్యాయవాదులు చదివి వినిపించారు. సిల్వియో తన ఆస్తుల్లో చాలా వరకు తన పిల్లల పేరు మీదే రాశారు. 100 మిలియన్ యూరోలను మాత్రం తన సోదరుడు పాలోకు రాసిచ్చారు. తన ఫోర్జా ఇటాలియీ పార్టీ తరఫున మాజీ సెనెటర్ గా ఉన్న తన ఆప్తుడు మార్సెలో డెలుట్రీకి మరో 30 మిలియన్ యూరోలు రాసిచ్చారు. 


లుకేమియాతో జూన్ 12న సిల్వియో మృతి


సిల్వియో బెర్లుస్కోని కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్నారు. 86 ఏళ్ల వయస్సులో జూన్ 12వ తేదీన కన్నుమూశారు. ఇటలీకి మూడు సార్లు ప్రధానిగా పని చేశారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా సిల్వియో గుర్తింపు పొందారు. ఇటలీలో మూడో సంపన్న వ్యక్తి సిల్వియో.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial