Gold Mine: దక్షిణాఫ్రికాలో ఘోర విషాదం - బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి, ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్

Southafrica Mines: దక్షిణాఫ్రికాలోని గనుల్లో అక్రమ మైనింగ్ చేస్తోన్న వందలాది మంది కార్మికులు చిక్కుకుపోగా దాదాపు 100 మంది వరకూ చనిపోయినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

Several Workers Trapped In South Africa Gold Mines: దక్షిణాఫ్రికాలో (Southafrica) ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కడ బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వచ్చిన వందలాది మంది కార్మికులు అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వాయువ్య ప్రావిన్స్‌లోని గనిలో దాదాపు 100 మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు, మీడియా వర్గాలు తెలిపాయి. తొలుత గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ససేమిరా అన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం.. పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగానే ఓ క్రేన్‌ను రంగంలోకి దించింది. అక్రమ మైనింగ్ చేయడానికి వెళ్లిన కార్మికుల్లో 100 మంది గత కొన్ని నెలలుగా అందులోనే చిక్కుకుపోయి ఆకలి, డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

కాగా, బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణం. వందల సంఖ్యలో పాడుపడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. వీరు వెళ్లేటప్పుడు ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోపలికి తీసుకెళ్తారు.

అక్రమ మైనింగ్‌పై కొరడా

బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. 2023 డిసెంబరులో 'ఆపరేషన్ క్లోజ్ ది హోల్'ను (Operation Close The Hole) చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 13 వేల మందిని అరెస్ట్ చేసింది. అరెస్టుకు భయపడిన అనేక మంది కార్మికులు.. 2.5 కి.మీ లోతు ఉండే స్టిల్‌ఫౌంటెయిన్ గనిలో తలదాచుకున్నారు. వీరిని బయటకు రప్పించేందుకు విఫలయత్నం చేసిన పోలీసులు.. నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మాసివేశారు. వారిని బయటకు తీసుకువచ్చే ప్రసక్తే లేదన్నారు. దీంతో వందలాది మంది గనిలోనే ఉండిపోయారు. 'మాకు సాయం చేయండి. ఆహారం ఇవ్వండి లేదా బయటకు తీసుకురండి.' అని గనిలో ఓ కార్మికుడు రికార్డు చేసిన వీడియో ఇటీవలే బయటకు వచ్చింది. ఇలానే మరిన్ని వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. దీంతో ఓ కార్మికుడి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. దిగొచ్చిన ప్రభుత్వం మైన్ వద్ద సహాయక చర్యలు చేపట్టింది.

జనవరి 10 నుంచి ఇప్పటివరకూ 35 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికార యంత్రాంగం.. 24 మంది మృతదేహాలను వెలికితీసింది. మరో 500 మంది గనిలోనే ఉన్నట్లు తెలుస్తుండగా.. వారు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపింది. మంగళవారం ఒక్క రోజే 8 మందిని ప్రాణాలతో.. మరో 6 మృతదేహాలను బయటకు తీసుకొచ్చామని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. గనిలోకి వెళ్లేందుకు ఉంచిన తాళ్లు, కప్పీ వ్యవస్థను పోలీసులు తొలగించడం వల్లే బయటకు రాలేకపోతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆకలితో ఎంతో మంది చనిపోతున్నారని పేర్కొంటున్నారు. అయితే, వీరి వాదనను ఖండించిన పోలీసులు.. గనిలోంచి వారు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామనే భయంతోనే వారు బయటకు రావడం లేదని చెబుతున్నారు. గతంలో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపడితే వందల మంది ప్రాణాలు పోయుండేవి కాదని అంటున్నారు.

Also Read: Notices to Zuckerberg: జుకర్ బెర్గ్‌కు ఎంత దైర్యం - బీజేపీ ఓడిపోయిందని ఫేక్ ప్రచారం - నోటీసులు ఇచ్చిన పార్లమెంటరీ కమిటీ !

Continues below advertisement
Sponsored Links by Taboola