Russia Nuclear Weapons: 



అణుయుద్ధం తప్పదా..? 


ఉక్రెయిన్‌పై రష్యా న్యూక్లియర్ వార్ ప్రకటించనుందా..? చాలా రోజులుగా ఈ వాదన వినిపిస్తూనే ఉన్నా...రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. బెలారస్‌లో ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసి ఉంచాం అంటూ పుతిన్ తేల్చి చెప్పారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే...రష్యా  భూభాగంపై దాడి చేయాలని చూసినప్పుడు మాత్రమే న్యూక్లియర్‌ వార్‌కి దిగుతామని స్పష్టం చేశారు పుతిన్. అటు అగ్రరాజ్యం మాత్రం రష్యా అణ్వాయుధాలు వినియోగిస్తుందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని చాలా రోజులుగా వాదిస్తోంది. ఇటు పుతిన్ మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. అప్పటి నుంచి బెలారస్‌ రష్యాకు హెల్ప్ చేస్తోంది. చెప్పాలంటే...ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో ఇది "లాంఛ్‌ప్యాడ్‌"గా మారింది. పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించే యోచనలో ఉంది రష్యా. "మాపైన వ్యూహాత్మకంగా గెలవాలని చూసే వాళ్లకు ఇదో వార్నింగ్" అని పుతిన్ స్పష్టంగా చెప్పడం అంతర్జాతీయంగా అలజడి రేపుతోంది. "మీరు ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తున్నారా..?" అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పుతిన్. 


"ప్రపంచం మొత్తాన్ని భయపెట్టాల్సిన అవసరం మాకేముంది..? ఇప్పటికే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. రష్యా భూభాగంపై దాడి చేయాలని, ఆక్రమించుకోవాలని చూసినప్పుడు అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా వెనకాడం"


- పుతిన్, రష్యా అధ్యక్షుడు