Russian Army Aircraft Crash: రష్యాకు చెందిన ఓ యుద్ధ విమానం కూలిపోయింది. దాదాపు 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో ప్రయాణిస్తున్న ఆ సైనిక విమానం కూలిపోయినట్లుగా అంతర్జాతీయ మీడియా రిపోర్టు చేసింది. విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్ఐఏ కూడా ధ్రువీకరించింది. ఖైదీల మార్పిడి ఒప్పందం ప్రకారం ఈ ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను ఉక్రెయిన్‌కు తీసుకువెళుతున్నారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఆర్ఐఏ వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో యుద్ధ ఖైదీలే కాకుండా ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు.


రక్షణ శాఖ ప్రకటన ఇది
ఉక్రేనియన్ ఖైదీలను తీసుకువెళుతున్న రష్యన్ Il-76 సైనిక రవాణా విమానం బెల్గోరోడ్ ప్రాంతంలో కూలిపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. "మాస్కో సమయం సుమారు 11:00 గంటలకు, బెల్గోరోడ్ ప్రాంతంలో విమానం Il-76 విమానం కూలిపోయింది. అందులో 65 మంది ఉక్రేనియన్ సాయుధ దళాల సైనికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు’’ అని చెప్పారు.


ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి రష్యన్ మిలిటరీ స్పేస్ ఫోర్సెస్ కమిషన్ అత్యవసరంగా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అయితే Il-76 విమానం క్రాష్‌కు ఉక్రెయిన్ ఆర్మీనే కారణమని.. తొలుత ఆ దేశ మీడియా రాసింది. కానీ, ఆ విమానంలో తమ దేశ సైనికులే యుద్ధ ఖైదీలుగా ఉన్నారని తెలియడంతో ఆ వార్తను తొలగించారు. కూలిన విమానంలో రష్యా క్షిపణులను తరలిస్తోందని, యుద్ధ ఖైదీలను కాదని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. కానీ రష్యా మాత్రం అందులో ఉన్నది యుద్ధ ఖైదీలేనని చెప్తోంది. దీనిపై రష్యా పార్లమెంట్ స్పీకర్ మాట్లాడుతూ.. ‘సొంత సైనికులు వెళ్తున్న విమానాన్ని వారు కూల్చివేశారు. మానవత్వంతో కూడిన మిషన్‌లో భాగమైన మా పైలట్లు ఆ విమానంలో ఉన్నారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.