US Primary Election: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి రేసులో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జో బైడెన్ (Joe Biden) నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. న్యూ హాంప్‌షైర్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ (Republican Party) తరఫున ట్రంప్ గెలుపొందారు. డెమొక్రాట్ల తరఫున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  విజయం సాధించారు. అయోవా విజయం తరువాత ట్రంప్ న్యూ హాంప్‌షైర్‌‌లో రెండో  విజయం సాధించారు. దీంతో నవంబర్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌తో తలపడే అవకాశాలు మెరుగయ్యాయి. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ రెండో స్థానంలో నిలిచారు.


ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం హేలీ 46.6 శాతం ఓట్లు సాధించారు. ట్రంప్ 52.3 శాతం సాధించారని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. అలాగే న్యూ హాంప్‌షైర్ డెమోక్రటిక్ ప్రైమరీలో రైట్-ఇన్ అభ్యర్థిగా బైడెన్  విజయం సాధించారు. ఆయన ప్రచారం చేయకపోయినా విజయం సాధించినట్లు రాయిటర్స్ తెలిపింది. 1976 నుంచి న్యూ హాంప్‌షైర్, వైట్ హౌస్ కోసం అగ్రశ్రేణి అభ్యర్థులు పోటీ పడుతున్నారు.


న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ట్రంప్, హేలీల మధ్య హోరాహోరీగా పోరుసాగింది. ఈ ఎన్నికల్లో హేలీ ఓడిపోయినా, ఫిబ్రవరి 24న తన సొంత రాష్ట్రమైన సౌత్ కరోలినాలో జరిగే తదుపరి ప్రైమరీలో గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది. అయోవాలో హేలీ మూడో స్థానంలో నిలిచారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని భావించారు. ట్రంప్‌ను ఓడించి రాష్ట్రాన్ని గెలుచుకుంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ట్రంప్ విజయం సాధించారు.


న్యూ హాంప్‌షైర్‌లో విజయం సాధించినా ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం ట్రంప్‌కు ఎదురుగాలి తప్పదని చెబుతున్నాయి. నాలుగు వైపుల నుంచి ట్రంప్ నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆరోపణలు చేసిన మహిళకు ట్రంప్ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారనే విమర్శలు ఉన్నాయి.  


ఎడిసన్ యొక్క ఎగ్జిట్ పోల్ ప్రకారం.. రిపబ్లికన్ ప్రైమరీలో పాల్గొన్న దాదాపు సగం మంది ఓటర్లు ట్రంప్ తన నేరాలపై ఆగ్రహంగా ఉన్నారు. కోర్టు ట్రంప్‌ను దోషిగా నిర్ధారిస్తే సేవ చేయడానికి అతడు సరైన వ్యక్తి కాదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే  న్యూ హాంప్‌షైర్ డెమొక్రాటిక్ ప్రైమరీలో బిడెన్ విజయాన్ని ఎడిసన్ అంచనా వేసింది. రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లలో మూడింట రెండు వంతుల మంది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పేలవంగా ఉందని పేర్కొన్నారు.


అయోవాలో ట్రంప్ హవా
అయోవా స్టేట్‌లో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్‌కు  21.4, నిక్కీ హేలీకి 17.7, వివేక్ రామస్వామికి 7.2 శాతం ఓట్లు పడ్డాయి. అక్కడ ఎన్నికల ప్రచారం చేయకపోయినా రాన్ డీశాంటీస్‌, నిక్కీ హేలీని వెనక్కినెట్టిన ట్రంప్ మరో సారి తన సత్తా చాటారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం ఖరారు కావడానికి 1,215 ఓట్లు అవసరం కాగా.. మొదటి రౌండ్‌లోనే డొనాల్డ్ ట్రంప్‌కు 2,035 ఓట్లు వచ్చాయి. రాన్ డీశాంటీస్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 824 ఓట్లు వచ్చాయి. నిక్కీ హేలీ-682, వివేక్ రామస్వామి- 278 ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. 


ప్రచారం చేయని ట్రంప్
అయోవాలో డిశాంటిస్, నిక్కీ హేలీ ఇద్దరూ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు రోజు జరిగిన ప్రచారంలో రాన్ డీశాంటీస్‌ మాట్లాడుతూ.. "మీరు చలిని తట్టుకుని, నా కోసం తిరగడానికి సిద్ధంగా ఉంటే, నేను మీ కోసం రాబోయే ఎనిమిదేళ్లు పోరాడుతాను, మనం ఈ దేశాన్ని మలుపు తిప్పబోతున్నాం’ అంటూ అక్కడి ప్రజలను ఉద్దేశించి అన్నారు. నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు  తనకు, డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే అనూహ్యంగా ట్రంప్‌కు మెజారిటీ వచ్చింది. తన ప్రత్యర్థుల మాదిరిగా  ట్రంప్ ఇక్కడ ప్రచారం చేయలేదు. కేవలం ఆయన మద్దతుదారులు మాత్రమే ప్రచారం చేశారు.