Chicago Gun Fire: కాల్పుల మోతతో చికాగో (Chicago) నగరం దద్ధరిల్లింది. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పల(Gun Fire)కు తెగపడ్డాడు. జోలియట్ (Joliet), విల్ కౌంటీ (Will County) నగరాల్లో నిందితుడు సోమవారం 8 మందిని కాల్చి చంపాడు. కాల్పులు జరిపిన నిందితుడికి బాధితులు అంతకుముందే తెలుసని పోలీసులు తెలిపారు. ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడం కోసం ఎఫ్‌బీఐ ఫ్యుజిటివ్ టాస్క్‌ఫోర్స్ స్థానిక పోలీసులకు సహాయం చేస్తోందని జోలియట్ పోలీస్ చీఫ్ విలియం ఎవాన్స్ తెలిపారు. హత్యకు గురైన వారిలో ఒకరి మృతదేహం విల్ కౌంటీలోని ఒక ఇంట్లో ఆదివారం లభించింది. జోలియట్‌లోని రెండు ఇళ్లలో మిగతా 7 మృతదేహాలు సోమవారం లభించినట్లు అధికారి వెల్లడించారు. 


జోలియట్‌లో ఆదివారం ఒక వ్యక్తిపై కాల్పులు జరిగాయని, దానికి ప్రస్తుత ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసుల తెలిపారు.  తాను 29 ఏళ్లుగా పోలీసుగా ఉన్నానని, తన కేరీర్‌లో చూసిన అత్యంత దారుణమైన ఘటన ఇదని జోలియట్ హోమ్స్ వెలుపల ఒక వార్తా సమావేశంలో ఎవాన్స్ చెప్పారు. విల్ కౌంటీ చీఫ్ డిప్యూటీ డాన్ జంగిల్స్ మీడియా సమావేశంలో  దాడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.  కాల్పులు జరిగిన తరువాత ఎంత సేపటికి చనిపోయారనే విషయంపై స్పష్టత లేదని, పోస్ట్ మార్టం పరీక్షలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. 






ఇళ్లలో సోమవారం దొరికిన ‌మ‌ృతదేహాలు అన్నీ కుటుంబానికి చెందినవని జోలియట్ పోలీస్ చీఫ్ విలియం ఎవాన్స్ తెలిపారు. చనిపోయిన వారు అనుమానితుడి కుటుంబ సభ్యులేనా అనే ప్రశ్నకు ఎవాన్స్ సమాధానం ఇస్తూ.. అనుమానితుడు వారికి తెలుసునని, ఇతర విషయాలు దర్యాప్తులో తేలతాయని చెప్పారు. జోలియట్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఫేస్‌బుక్ పోస్ట్‌లో స్పందిస్తూ.. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి గాలిస్తున్నట్లు చెప్పారు. కాల్పులు జరిపినట్లు భావిస్తున్న వ్యక్తి ఫొటో, వాహనం ఫొటోలను షేర్ చేశారు. 


కాగా నిందితుడిని పోలీసులు రోమియో నాన్స్‌గా గుర్తించారు. ప్రస్తుతం రోమియో నాన్స్ మారణాయుధాలతో ఎరుపురంగు టయోటా కారులో తిరుగుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. నిందితుడు కారులో తిరుగుతున్న చిత్రాలను విల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.  ఆదివారం మధ్యాహ్నం జరిగిన రెండు వేర్వేరు కాల్పులలతో నిందితుడికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఫొటోలో ఉన్న నిందితుడిని ఎవరైనా గుర్తించినా, సమాచారం తెలిసినా తమకు చెప్పాలని పోలీసులు కోరుతున్నారు. 


also Read: అటల్‌సేతుపై తొలి యాక్సిడెంట్‌.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం