Ukraine Russia War: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్‌, ఖార్కివ్‌, మరియూపోల్‌, సుమీ నగరాల్లో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి కాల్పుల విరమణ మొదలవుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ విరమణ ఎంతసేపు ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయలేదు.


పౌరుల తరలింపు


ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్ వ్యక్తిగత అభ్యర్థన మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఈ సమయంలో కారిడార్ల ద్వారా పౌరులను తరలించనున్నారు.







మేక్రాన్ ఆందోళన


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్.. ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో ఉన్న అణువిద్యుత్ కేంద్రాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం నాలుగు విద్యుత్ కేంద్రాల్లో ఉన్న 15 అణు రియాక్టర్లను భద్రంగా చూడాలని, పౌరుల క్షేమం గురించి ఆలోచించాలని మేక్రాన్.. పుతిన్‌ను కోరినట్లు సమాచారం


మానవ సంక్షోభం


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్ర మానవ సంక్షోభానికి దారితీస్తోంది. భీకర క్షిపణి, బాంబు దాడులతో దిక్కుతోచని స్థితిలోకి జారిపోయిన పౌరులు పరాయి దేశాలకు వలసపోతున్నారు. యుద్ధం ఆరంభమైన 11 రోజుల్లోనే ఈ శరణార్థుల సంఖ్య 15 లక్షలు దాటిపోయింది.


రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఇంత భారీ స్థాయిలో వలసపోవడం ఇదే మొదటిసారని ఐరాస శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) ఆదివారం తెలిపింది. ఈ సంఖ్య 70 లక్షలకు చేరొచ్చని ఐరోపా సంక్షోభ నిర్వహణ విభాగం కమిషనర్‌ పేర్కొన్నారు.


1.8 కోట్ల మంది ఉక్రెయిన్‌వాసులపై ఈ యుద్ధ ప్రభావం పడొచ్చని తెలిపారు. ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద శరణార్థి సంక్షోభంగా మారొచ్చని ఐరాస హెచ్చరించింది.