Russia-Ukraine War:  ఉక్రెయిన్ పై రష్యా భీకర యుద్ధం చేస్తుంది. అమెరికా సహా యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా అమెరికా మరోసారి రష్యాపై ఆంక్షలు విధించింది. అమెరికా రష్యా అనుకూల వాణిజ్య హోదా(Permanent Normal Trade Relations) స్టాటస్ తొలగించింది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్, మిత్రదేశాలు రష్యాపై ఆంక్షలు పొడిగించేలా చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించడానికి ఇతర చర్యలు తీసుకుంటాయని బైడెన్ శుక్రవారం ప్రకటించారు. 






రష్యన్ వస్తువులపై భారీ సుంకాలు 


రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడేలా మిత్రదేశాలతో కలిసి యూఎస్ ఎత్తుగడులు వేస్తుంది. రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతూ విస్తృత శ్రేణి రష్యన్ వస్తువులపై సుంకాలను విధించడానికి యునైటెడ్ స్టేట్స్‌ సిద్ధమవుతుంది. జీ-7 దేశాలతో కలిసి రష్యా వస్తువులపై సుంకాలను పెంచడానికి నిర్ణయించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి రష్యాకు రుణాలు నిరాకరించేలా చర్యలు చేపట్టనుంది. సీ ఫుడ్, వోడ్కా, పారిశ్రామికేతర వజ్రాలతో సహా రష్యా నుంచి దిగుమతి చేసుకునే కొన్నింటిపై నిషేధం విధించే ఉత్తర్వులపై అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సంతకం చేయనున్నారు. వైట్ హౌస్ అంచనాల ప్రకారం ఇది రష్యాకు ఒక బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఎగుమతి ఆదాయాన్ని గండిపడినట్లే అవుతుంది. అత్యాధునిక గడియారాలు, లగ్జరీ వాహనాలు, మద్యం, నగలు, దుస్తులు, సంవత్సరానికి సుమారు 550 మిలియన్ల డాలర్ల విలువైన వస్తువులతో సహా రష్యాకు అమెరికా ఎగుమతి చేసే లగ్జరీ వస్తువులను నిషేధించాలని కూడా అధ్యక్షుడు యోచిస్తున్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలలో అమెరికా సంస్థల పెట్టుబడులను నిషేధించాలని జో బైడెన్ భావిస్తున్నారు. 


భారీ మూల్యం తప్పదు 


ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాన్ని ప్రయోగిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాను హెచ్చరించారు. నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన దురాక్రమణ సిద్ధాంతానికి సమాధానం చెప్పితీరాల్సి వస్తుందన్నారు.