Russia Ukraine War: సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓ కేఫ్‌లో ఆదివారం జరిగిన పేలుడు ఘటన వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపించింది. దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్న యువతిని అదుపులోకి తీసుకుంది.
రష్యా - ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక సంఘటన చోటుచేసుకుంది. యుద్ధాన్ని ప్రోత్సహించేలా బ్లాగ్‌లు రాస్తున్న వ్యక్తిని ఓ యువతి బాంబుతో పేల్చేసింది. సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనతో రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మరోసారి అగ్గిరాజుకుంది.
రష్యాలో రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని ఓ కేఫ్‌లో ఆదివారం జరిగిన పేలుడులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో పుతిన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న రష్యా సైనిక బ్లాగర్ వ్లాడ్లెన్ టాటర్‌స్కీ లక్ష్యంగా ఓ యువతి బాంబు దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో మరో 32 మంది గాయపడగా అందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉందని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న 26 ఏళ్ల దార్యా త్రిపోవా అనే యువతిని అదుపులోకి తీసుకున్న ఉగ్రవాద నిరోధక బృందాలు విచారణ జరుపుతున్నాయి. టాటర్‌స్కీకి దార్యా త్రిపోవా బహుమతిగా ఇచ్చిన విగ్రహంలో బాంబు ఉందని.. దాన్ని ఆమె రిమోట్ సాయంతో పేల్చినట్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో నిరసనల్లో పాల్గొన్నందుకు దార్యా త్రిపోవాను గతంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
డాన్ బాస్ ప్రాంతంలో జన్మించిన టాటర్‌స్కీ... 2014లో దొంగతనం కేసులో అరెస్టై జైలుకెళ్లాడు. ఉక్రెయిన్‌లోని క్రిమియాను 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత జైలు నుంచి తప్పించుకుని వేర్పాటువాదులతో చేతులు కలిపాడు. తర్వాత సైనిక బ్లాగింగ్ వైపు మళ్లిన టాటర్‌స్కీ... యుద్ధాన్ని ప్రోత్సహించేలా చేసిన బ్లాగ్‌లతో పేరొందాడు.
తాజా బాంబు పేలుడుకు ఉక్రెయిన్ సెక్యూరిటీ ఏజెన్సీలే కారణమని రష్యాకు చెందిన తీవ్రవాద నిరోధక సంస్థ పేర్కొంది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి చెందిన అవినీతి వ్యతిరేక ఫౌండేషన్‌కు చెందిన కొంతమంది ఉక్రెయిన్ ప్రత్యేక సంస్థలకు సహకారం అందించినట్లు తెలిపింది. ప్రస్తుతం అరెస్టైన దార్యా త్రిపోవా... నావల్నీ గ్రూపులో క్రియాశీల మద్దతుదారు అని వెల్లడించింది.
కాగా.. పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న విషయం తనకు తెలుసని, అయితే గిఫ్ట్‌లో పెట్టిన విషయం తెలియదని యువతి చెప్పినట్లు స్థానిక మీడియా తెలిపింది. టాటర్స్కీతో ఏం మాట్లాడిందనే అంశంపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు రష్యా మీడియా వర్గాలు చెబుతున్నాయి. యువతి తీసుకొచ్చిన గిఫ్ట్‌లో బాంబు ఉందని భద్రతా సిబ్బంది ముందుగానే అనుమానించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 'గిఫ్ట్‌ను డోర్ వద్ద వదిలి వెళ్లాలని గార్డ్స్ ఆమెకు సూచించారు. అందులో బాంబు ఉందేమోనని అనుమానించారు. అంతలోనే వారు దీనిపై జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారు. చివరకు ఆ యువతి గిఫ్ట్‌ను తీసుకెళ్లి టాటర్‌స్కీకి అందించింది. టాటర్‌స్కీ కూడా జోకులు వేస్తూ గిఫ్ట్‌ను టేబుల్‌పై పెట్టాడు. ఆ తర్వాత అది పేలిపోయింది' అని ప్రత్యక్ష సాక్షి వివరించారు.