Russia- Ukraine War:


ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 9న ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే ఇలా ప్రకటించడం వల్ల రష్యా మరింత బలంగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేసే అవకాశం ఉంది.


ఇదే లాభం


ఉక్రెయిన్‌పై అధికారికంగా యుద్ధం ప్రకటించడం వల్ల రష్యా తన వద్ద ఉన్న రిజర్వ్‌ బలగాలను కూడా ఆక్రమణకు పూర్తిస్థాయిలో మోహరించేందుకు వీలు కలుగుతుంది. దీంతో అమెరికా, పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై తాము చేపట్టింది ప్రత్యేక సైనిక చర్యగా పుతిన్‌ చెబుతూ వస్తున్నారు.


దాడి ఉద్ధృతం


ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా దాడి మొదలుపెట్టింది. రెండు నెలలు దాటినప్పిటికీ ఇంకా ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోలేకపోయింది రష్యా. ఉక్రెయిన్ బలగాలు ఊహించిన దాని కన్నా దీటుగా బదులిస్తుండటంతో రష్యా కొత్త ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా మేరియుపొల్‌లోని కీలకమైన అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ప్రాంగణం చుట్టూ భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ సైనిక బలగాలు వెల్లడించాయి.


రష్యాకు ఎదురుదెబ్బ


2014లో క్రిమియాను ఆక్రమించిన సమయంలో రష్యా సైన్యం చాలా వేగంగా పని పూర్తి చేసింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలోనూ ఇదే ప్లాన్ అమలు చేయాలని పుతిన్ భావించారు. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ నగరాలను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని కూల్చేసి తమకు నచ్చిన వారితో తోలుబొమ్మ సర్కార్ ఏర్పాటు చేయించాలని పుతిన్ ప్రణాళిక రచించారు.


కానీ యుద్ధం మొదలైన ఐదో రోజుకే ఇది అంత సులభం కాదని పుతిన్‌కు అర్థమైంది. అందుకే రష్యా లాంటి బలమైన సైన్యానికి కూడా ఉక్రెయిన్‌ ఇంకా చేజిక్కలేదు. దీంతో పుతిన్ ప్లాన్- బీ అమలుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, నివాసాలు ఇలా వీటిపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు.


జెలెన్‌స్కీ హీరో


ఈ యుద్ధంతో ఐరోపా సహా ప్రపంచవ్యాప్తంగా జెలెన్‌స్కీ హీరో అయిపోయారు. రాజధాని కీవ్ నగరంలో రష్యా వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ అక్కడి నుంచే జెలెన్‌స్కీ రోజూ వీడియోలు పెడుతున్నారు. మరోవైపు 23 ఏళ్లలో నిర్మించుకున్న పుతిన్ ఇమేజ్.. ఈ యుద్ధంతో కాస్త తగ్గింది.


Also Read: Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు ఊరట- కండిషన్ బెయిల్ ఇచ్చిన కోర్టు


Also Read: Covid Pandemic: ఇదేముంది, రానున్న వేరియంట్‌ సృష్టించేది అంతకుమించి- బిల్‌గేట్స్‌ హెచ్చరిక