Oil Prices Will Hit 300 Dollar A Barrel: ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. మూడు దఫాలుగా ఉక్రెయిన్, రష్యా నేతల మధ్య చర్చలు జరిగినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో క్రూడాయిల్ ధరలు జీవిత కాల గరిష్టానికి చేరతాయిని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ముడి చమురు ధరల పెరుగుదలపై రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ కీలక ప్రకటన చేశారు.
300 డాలర్లకు ఎగబాకనున్న ముడి చమురు
రష్యా చమురు దిగుమతులపై నిషేధం మరిన్ని పర్యవసానాలకు దారి తీస్తుందని అలెగ్జాండర్ నోవాక్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దాడులతో మాస్కోపై ఆంక్షలు మరింతగా పెరుగుతున్నాయి. రష్యా నుంచి ఎగుమతి అయ్యే ముడి చమురుపై అమెరికా, యూరప్ దేశాల నిషేధం (US, Europe Ban Imports Of Crude Oil) ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ బ్యారెల్ ధర 300 డాలర్ల దాటే అవకాశం ఉందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారని రష్యా మీడియా రిపోర్ట్ చేసింది.
రష్యా ఎగుమతులపై నిషేధం..
యూరోపియన్ మార్కెట్లో రష్యా అందించే ముడి చమురును ఇతర దేశాలు సరఫరా చేయడం అసాధ్యం. కేవలం ఆరు నెలలో, లేక ఓ ఏడాది పాటు యూరప్ కస్టమర్లు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇదే విషయాన్ని రష్యా ప్రభుత్వం తమ పౌరులకు వాస్తవ పరిస్థితి (Russia Ukraine War)ని వెల్లడించి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నోవాక్ పేర్కొన్నారు. యూరప్ దేశాలు, అమెరికా లాంటి ఇతర దేశాలు రష్యా ముడి చమురుపై నిషేధం మరింతకాలం కొనసాగిస్తే అస్థిరత ఏర్పడి, ఇది మార్కెట్లో మరిన్ని ఇబ్బందులకు దారి తీస్తుందని వివరించారు.
నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ ప్రాజెక్ట్ ఆగిపోయినందుకు రష్యా ప్రతీకారంగా నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్ ద్వారా సరఫరాలను నిలిపివేసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నారు. దీని వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని నోవాక్ అన్నారు. ఇతర యూరప్ దేశాల నేతలు రష్యాపై కుట్రపూరితంగా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారని రష్యా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నోవాక్ సూచించారు. మూడు రౌండ్ల చర్చల తరువాత సైతం ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేసింది, ప్రధాన నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని అధ్యక్షుడు జెలెన్ స్కీని బంధించాలని రష్యా భావిస్తోంది.
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!