Rishi Sunak on Gender: 


ట్రాన్స్‌జెండర్‌పై సునాక్ వ్యాఖ్యలు..


బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ట్రాన్స్‌జెండర్‌ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్‌పై డిబేట్ జరుగుతోంది. Conservative Party కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన జెండర్ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు.  ఆ క్రమంలోనే "మగాడు మగాడే, మహిళ మహిళే" అని తేల్చి చెప్పారు. పురుషుడు మహిళగా, మహిళ పురుషుడిగా మారాలనుకోవడం పిచ్చితనమని అన్నారు. ఎవరైనా ఎలా అయినా మారిపోవడాన్ని అంగీకరించకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రిలేషన్‌షిప్స్ గురించి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుందని స్పష్టం చేశారు సునాక్. 


"మహిళలు మహిళలే, పురుషులు పురుషులే. ఇది కామన్‌ సెన్స్. ఎవరు ఎలా అయినా మారిపోవచ్చనడాన్ని మనం ఏ మాత్రం అంగీకరించకూడదు. వాళ్లు అలా చేయలేరు. ఈ దేశ ప్రజల జీవితాల్ని మార్చేస్తాం. అదే మా లక్ష్యం. కానీ...మన అభివృద్ధి, స్వేచ్ఛ అనేవి వివాదాస్పదం అవకుండా ఉండడం అంత కన్నా ముఖ్యం. కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విషయాన్ని అంగీకరిస్తారు. స్కూల్‌లో తమ పిల్లలు రిలేషన్‌షిప్స్ గురించి ఏం నేర్చుకుంటున్నారు అని తల్లిదండ్రులు ఆందోళన పడకూడదు"


- రిషి సునాక్, బ్రిటన్ ప్రధాని 






సోషల్ మీడియాలో అసహనం..


అయితే..ఆయన చేసిన వ్యాఖ్యలు ఓ వర్గాన్ని అసంతృప్తికి గురి చేశాయి. అలా ఎలా మాట్లాడతారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు కొందరు. ట్రాన్స్‌జెండర్‌ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. కామన్‌ సెన్స్ గురించి మాట్లాడిన సునాక్..ఆ సెన్స్ లేకుండానే మాట్లాడారంటూ ఇంకొందరు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్‌లు సొసైటీలో చాలా విధాలుగా సవాళ్లు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు సునాక్ చేసిన వ్యాఖ్యలు మరింత సమస్యగా మారాయని ట్విటర్‌లో మండి పడుతున్నారు. బహుశా సునాక్‌కి సెక్స్‌, జెండర్‌కి ఉన్న తేడా ఏంటో తెలిసి ఉండదని..ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు స్వరూపం బయటపడిందంటూ తీవ్రంగా స్పందిస్తూ వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై రిషి సునాక్ ఏమైనా వివరణ ఇస్తారేమో చూడాలి.