దేశీయంగా బియ్యం ధరలను అదుపులో పెట్టేందుకు కేంద్రం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. బాస్మతీయేతర బియ్యాన్ని నిషేధిత ఎగుమతుల జాబితాలోకి చేర్చినట్టు డైరెక్టరరేట్ ఆఫ్ జనరల్ ఫారిన్ ట్రేడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది.


ఎగబడి కొంటున్న NRIలు


భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ముఖ్యంగా అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలో బియ్యానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఎగుమతుల నిషేధంతో అమెరికాలో 20 పౌండ్లు అంటే సుమారు పది కిలోలు బరువు ఉండే రైస్ బ్యాగ్ ధర 18$ డాలర్లు నుంచి ఏకంగా 50$ డాలర్లకు పెరిగింది. అంటే దాదాపు 1500 రూపాయుల ఉండే బ్యాగ్ కాస్ట్ ఇప్పుడు నాలుగు వేలకు పెరిగింది. కిలో నాలుగు వందల రూపాయలు పలుకుతోందన్నమాట.


ఒక్కసారిగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుకోవడంతో ఎన్‌ఆర్ఐల్లో ఆందోళన పెరిగింది. బియ్యం బస్తాల కోసం సూపర్ మార్కెట్లకు పరుగులు పెడుతున్నారు. గంటల కొద్ది క్యూలో ఉంటున్నారు. ఎన్‌ఆర్‌ఐలను కంట్రోల్ చేయడం స్థానిక సూపర్ మార్కెట్ల సిబ్బందికి తలకు మించిన భారం అవుతోంది. దుకాణాల్లోకి వెళ్లిన వారు సంతలో కూరగాయల కోసం పోటీ పడినట్లు బియ్యం కోసం ఎగబడుతున్న ఎగపడుతున్నారు. 
ఇక్కడ ఉన్న వీడియోలను చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది. 










ధరల నియంత్రణకే
బియ్యం ఎగుమతుల విషయానికి వస్తే దేశీయంగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు రెడీ చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, వరి పండించే ఇతర దేశాల్లో ప్రతికూల వాతావరణం తదితర కారణాల వల్లే ఎగుమతులు పెరిగాయని ఆహారశాఖ వెల్లడించింది.


అంతర్జాతీయంగా 40 శాతం వాటా
గత ఏడాది కాలంలో ధరలు 11 శాతం పెరగ్గా, గత నెలలో 3 శాతం మేర పెరిగాయి. వినియోగదారుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, భారత్ బియ్యం ఎగుమతుల్లో 40 శాతం వాటా కలిగి ఉంది.  2022లో ఇండియా రికార్డు స్థాయిలో 22.2 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది.


ఈ దేశాలపై ప్రభావం
ఈ నిషేధంతో థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికా, బంగ్లాదేశ్, నేపాల్‌, బెనిన్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా వంటి అనేక ఆఫ్రికన్ దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ దేశాలు భారత్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా బియ్యం ఎగుమతులపై భారత్ ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


కారణం ఏంటంటే?
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీంతో దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాలతో  చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీని ఫలితంగా దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని భావిస్తోంది. మరోవైపు ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది.