Putin win again: గ‌ర్జించు ర‌ష్యా(Russia).. గాండ్రించు ర‌ష్యా.. ప‌ర్జ‌న్య‌శంఖం పూరించు ర‌ష్యా.. మ‌రోసారి వ్లాద‌మిర్ పుతిన్‌(Vlodamir Putin)నే అధ్య‌క్షుడిగా ఎన్నుకుంది. అది కూడా క‌నీవినీ ఎరుగ‌ని మెజారిటీతో ఆయ‌న త‌న పీఠాన్ని సుస్థిరం చేసుకున్నారు. మూడు రోజుల పాటు సాగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పుతిన్‌కు దాదాపు 88శాతం ఓట్లు లభించినట్లు రష్యా ఎన్నికల సంఘం తెలిపింది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన తర్వాత ఈ విషయం తేలినట్లు పేర్కొంది. మూడు రోజులుగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్(Polling) ఆదివారం ముగిసింది. సోమ‌వారం ఉద‌యాన్నే ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. క‌డ‌ప‌టి వార్త‌లు అందే స‌రికి ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. 


74.22 శాతం పోలింగ్‌


మూడు రోజుల పాటు ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ర‌ష్యా ఎన్నిక‌ల్లో(Russia Elections) మొత్తం 74.22 శాతం పోలింగ్ నమోదైంది. అందులో పుతిన్​కు అత్యధికంగా 88శాతం ఓట్లను లభించినట్లు ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. పుతిన్​కు పోటీగా బరిలో ఉన్న న్యూ పీపుల్‌ పార్టీ వ్లాదిస్లవ్‌ డవాంకోవ్‌ 4.8 శాతం ఓట్లనే రాబ‌ట్టుకున్నారు. పోటీలో ఉన్న మూడో అభ్యర్థి కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన నికోలోయ్‌ ఖరితోనోవ్‌ 4.1 శాతం, లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన లియోనిడ్‌ స్లట్‌స్కీకి 3.15 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో పుతిన్ విజ‌యం ఏక‌ప‌క్షంగా సాగిపోయింది. అంతేకాదు.. సోవియెట్ యూనియ‌న్ చ‌రిత్ర‌లోనే 88 శాతం ఓట్లు కొల్ల‌గొట్ట‌డం ఇదే ప్ర‌ప్ర‌థ‌మం కావ‌డం గ‌మ‌నార్హం. 


సింప‌తీ క‌నిపించ‌లేదు!


ఇటీవ‌ల అనుమానాస్ప‌ద రీతిలో జైలులోనే మృతి చెందిన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నావ‌ల్నీ(Navelni) మ‌ద్ద‌తు దారులు పుతిన్‌కు వ్య‌తిరేకంగా.. నావ‌ల్నీకి సానుభూతిగా విస్తృతంగా ప్ర‌చారం చేశారు. వీరికితోడు దీంతో ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్ వ్యతిరేకులు, దివంగత విపక్ష నేత మద్దతుదారులంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పుతిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి బ్యాలెట్ పెట్టెల్లోకి ఇంకును పోశారు. అయితే.. ఈ సింప‌తీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. తొలి రెండు రోజులు మంద‌కొడిగా సాగిన పోలింగ్..  చివరి రోజు మాత్రం ఊపందుకుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్‌ పలు చోట్ల రష్యా భూభాగంపై డ్రోన్లుతో దాడులు చేసింది. ఈ దాడిలో ఇద్దరు మరణించగా, మరో 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇక‌, ఎన్నిక‌ల వేళ  16 నగరాల్లో ఆందోళ‌న‌ల‌కు దిగిన 65 మంది నావ‌ల్నీ మ‌ద్ద‌తు దారుల‌ను  పోలీసులు అరెస్టుచేశారు.  


పుతిన్‌ను కాద‌ని.. ఔన‌ని!


ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా పుతిన్(Putin) అంటే.. ర‌ష్యా నియంత అనే మాట విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దేశంలో ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాల‌న‌ లేదని విమర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ, పుతిన్‌తో పోల‌స్తే.. బ‌ల‌మైన నాయ‌కుడు ఎన్నిక‌ల్లో క‌నిపించ‌క‌పోవ‌డం, దేశాన్ని కొన్ని విష‌యాలు మిన‌హా అన్నింటా ముందుకు తీసుకువెళ్ల‌డంలో పుతిన్ బ‌ల‌మైన నేత‌గా ఎద‌గ‌డంతో ఆయ‌న విజ‌యం ఏక‌ప‌క్షంగా మారిపోయింది. రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం పుతిన్‌ దాదాపు 88 శాతం ఓట్లను కైవ‌సం చేసుకున్నారు. మొత్తం 60 ద‌శ‌ల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 71 ఏళ్ల‌ పుతిన్ అధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకున్నారు. కమ్యూనిస్ట్ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ కేవలం 4 శాతంతో రెండవ స్థానంలో నిలిచారు, కొత్తగా వచ్చిన వ్లాడిస్లావ్ దావన్కోవ్ మూడవ స్థానంలో, అల్ట్రా-నేషనలిస్ట్ లియోనిడ్ స్లట్స్కీ నాల్గవ స్థానంలో నిలిచారు. ఎన్నికలు ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 74.22 శాతం పోలింగ్ నమోదైంది, 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌మోదైన అత్య‌ధిక పోలింగ్ 67.5 శాతాన్ని ఇది అధిగ‌మించ‌డం గ‌మ‌నార్హం. 


మ‌మ్మ‌ల్ని భ‌య పెట్ట‌లేరు:  పుతిన్‌


అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న అనంత‌రం పుతిన్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ దేశాలను ధిక్కరించి ఉక్రెయిన్‌పై దాడి చేయాలనే తన నిర్ణయానికి ఈ ఎన్నిక‌లు ఆమోదం తెలిపాయ‌న్నారు. ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉన్నార‌న‌డానికి ఈ ఎన్నిక‌లు నిదర్శనంగా నిల‌చాయ‌ని తెలిపారు. ``మనల్ని ఎవరు, ఎంతగా భయపెట్టాలనుకున్నా, మనల్ని, మన సంకల్పాన్ని, మన స్పృహను అణచివేయాలనుకున్నా.. చరిత్రలో ఎవరూ విజయం సాధించలేదు`` అని పుతిన్ పేర్కొన్నారు. ``మ‌న‌ల‌ను శాసించ‌డం.. భ‌య‌ట పెట్ట‌డం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. ఇక ముందు కూడా  భవిష్యత్తులో ఎవ‌రూ భ‌య పెట్ట‌లేరు`` అని వ్యాఖ్యానించారు.  మరోవైపు దివంగత విపక్ష నేత నావల్నీపై తొలిసారిగా స్పందించిన పుతిన్​, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' నావల్నీ మరణం ఒక విషాదకరమై ఘటన. జైలులో ఉన్న వ్యక్తులు మరణించిన సందర్బాలు ఉన్నాయి. అయితే నావల్నీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే విడుదల చేసే ఆలోచన చేశాం. ఆయన తిరిగి రష్యాలో అడుగు పెట్టకూడదన్న నిబంధనతో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తు జైలులో ఉన్నప్పుడే మరణించాడు' అని పుతిన్ తెలిపారు.