America Presidential elections: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు(US Presidential Elections) ఈ ఏడాది న‌వంబ‌రు 5న జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్రాల్లో ఇప్ప‌టికే పోలింగ్(Poling) సాగుతోంది. ఎన్నిక‌లు జ‌ర‌గ‌ని రాష్ట్రాల్లో మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లే ఫైర్ బ్రాండ్ అని పేరున్న ట్రంప్‌.. ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం ద‌క్కించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్న నేప‌థ్యంలో తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌ను టార్గెట్ చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో అమెరిక‌న్ల‌ను కూడా ఆయ‌న ప‌రోక్షంగా హెచ్చ‌రిస్తున్నారు. దీంతో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు స‌ర్వ‌త్రా ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా ఒహియో రాష్ట్రంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడిన ట్రంప్‌.. న‌న్ను గెలిపించ‌క‌పోయినా.. తాను గెల‌వ‌క‌పోయినా దేశంలో ర‌క్త‌పాతం జ‌రుగుతుంద‌ని తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. నవంబర్‌ 5న జరగబోయే ఎన్నికలు అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నాయని తెలిపారు. ``నేను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుంది`` అని ట్రంప్ హెచ్చ‌రిక‌లు పంపారు.


ఎలా తెస్తారో చూస్తాం..


ఇక‌, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌ (Biden) విధానాలను ట్రంప్ తూర్పార‌బ‌డుతున్నారు. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో మెక్సికోలో చైనా ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న కార్ల తయారీ కేంద్రాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ``మీ ఆట‌లు సాగ‌వు. నేను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోను`` అని వ్యాఖ్యానించారు. చైనా త‌యారు చేసే కార్ల‌పై 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామన్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్ అనుస‌రిస్తున్న పారిశ్రామిక విధానాల‌ను కూడా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఈసారి తాను గెలవకపోతే.. బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవని డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 


ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. 


మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ‌చ్చాయి. అయితే.. ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఎన్నికల ప్రచార క‌మిటీ అధికార ప్రతినిధి కారోలిన్‌ లీవిట్‌ వివరణ ఇచ్చారు. బైడెన్ (Biden) విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ‘ఆర్థిక రక్తపాతం’ మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్‌ సానుభూతి ప్రకటించారు. అయితే, ట్రంప్‌(Trump) వ్యాఖ్యలను బైడెన్‌ ప్రచార బృందం తప్పుబట్టింది. గత ఎన్నికల్లో ప్ర‌జ‌లు ఆయ‌న‌ను తిప్పికొట్టార‌ని, దీంతో  ఘోర ఓటమి చవిచూసిన ట్రంప్‌ రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. ఆయన ప్రతీకారాన్ని, అతివాదాన్ని ఓటర్లు మరోసారి ఓడిస్తారని నిప్పులు చెరిగింది. 


వివాదాలే కేంద్రంగా ట్రంప్..


మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ అంటే వివాదాల‌కు కేంద్రం. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో క్యాపిటల్‌ హిల్‌పై దాడి ఘటనలో అరెస్టయిన వారిని ఆయన బందీలుగా, దేశభక్తులుగా అభివర్ణించి అంద‌రితోనూ తిట్టించుకున్నారు. ఇక ఇప్పుడు ర‌క్త‌పాతం అంటూ మ‌రో వివాదాల తుట్టెను క‌దిపారు. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి కావాల్సిన‌ ప్రతినిధుల మద్దతును డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌ సాధించిన విషయం తెలిసిందే. నవంబర్ 5న జరగబోయే ఎన్నికల్లో వీరు పోటీచేయ‌నున్నారు. 


ర‌చ్చ కూడా 


ట్రంప్ వ్య‌వ‌హార శైలిపై అమెరికా(America)లో నిర‌స‌న వ్యక్త‌మ‌వుతుంటే.. బ‌య‌ట నుంచి కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు త‌గ్గుతోంది. ట్రంప్‌ అభ్యర్థిత్వానికి తాను మద్దతివ్వడం లేదని ఆయన సొంత పార్టీ కీలక నేత మైక్‌ పెన్స్‌ తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్‌ అనేక విషయాల్లో పార్టీ విధానాలకు కట్టుబడలేదని వ్యాఖ్యానించారు. తనకు, ట్రంప్‌నకు మధ్య చాలా వ్యత్యాసముందన్నారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యాంగానికి లోబడే పనిచేశానని, ఎక్కడా ఒత్తిళ్లకు తలొగ్గి దారి తప్పలేదని చెప్పారు. 
 
కొన్ని లోపాలు ఉన్నా.. 


ఇక‌, కొన్ని లోపాలు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్ వైపే మొగ్గు ఉన్నట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న‌కు వ‌య‌సు అయిపోయింద‌ని.. మ‌తిమ‌రుపు(అల్జీమ‌ర్స్‌) వ్యాధి వ‌చ్చింద‌ని ట్రంప్ ప్ర‌చారం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కొంత వ‌ర‌కు బైడెన్ వైపే సానుకూలత క‌నిపిస్తోంది.