Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక డోనాల్డ్ ట్రంప్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోన్న ట్రంప్.. బ్రిటన్ రాజు చార్లెస్ చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ పట్ల మాత్రం కాస్త జాలి చూపారు. అతని ఇమ్మిగ్రేషన్ లో పలు లోపాలున్నప్పటికీ దేశం నుంచి బహిష్కరించే అవకాశాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. ఇటీవల ది న్యూయార్క్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని, ప్రిన్స్ హ్యారీని బహిష్కరించదలచుకోవడం లేదని, అతన్ని వదిలేస్తానని అన్నారు.


భార్యా బాధితుడు కావడమే దీనికి కారణం


అమెరికా విసా విషయంలో ప్రిన్స్ హ్యారీ గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్యూక్ సస్సెక్స్ ఇమ్మిగ్రేషన్‌లో కొన్ని సాంకేతిక లోపాల వల్ల అప్పట్లో ఆ దేశం వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. మాదకద్రవ్యాలను వినియోగించిన విషయాన్ని దాచి పెట్టారని, దీన్ని విసా దరఖాస్తులో పొందుపర్చలేదంటూ హెరిటేజ్ ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సమస్య తలెత్తింది. వీసా కోసం అప్లై చేసే సమయంలో డ్రగ్స్ వినియోగం గురించి వివరించలేదని హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ నైల్ గార్డెనర్ ఆరోపించారు. దీనిపై ఇమ్మిగ్రేషన్ అధికారులకు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పట్లో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌పై ప్రిన్స్ హ్యారీ కేసు కూడా వేశారు. అయితే అక్రమ వలసదారులను గుర్తించి, దేశం నుంచి బహిష్కరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. 


హ్యారీ ఇమ్మిగ్రేషన్ లో పలు లోపాలున్నప్పటికీ దేశం నుంచి బహిష్కరించేందుకు ట్రంప్ నిరాకరించారు. అందుకు అతను భార్యా బాధితుడు కావడమే కారణం. ప్రిన్స్ హ్యారీ- మెఘాన్ మార్కిల్ దంపతుల మధ్య అనేక తగాదాలు, సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ ఆయనను డిపోర్ట్ చేసి కొత్త సమస్యలను సృష్టించదలచుకోలేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ప్రిన్స్ తన భార్యతో చాలాకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని గుర్తుచేశారు. హ్యారీకి గానీ, మెఘాన్ మార్క్లే గానీ ట్రంప్‌పై సదభిప్రాయం లేదు. గతంలో బహిరంగంగా ఆయనను విమర్శించిన సందర్భాలూ లేకపోలేదు. ట్రంప్‌ను ఓ విభజనకారుడిగా, స్త్రీ ద్వేషిగా గతంలో మెఘాన్ విమర్శించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ కూడా ఏం తీసిపోలేదు. మెఘాన్‌పై కౌంటర్లు ఇచ్చారు. ప్రిన్స్ హ్యారీని కొరడాతో కొడుతుంటుందంటూ సెటైర్లు వేశారు.


కలిసే ఉన్నా వేర్వేరుగా జీవిస్తోన్న దంపతులు


రాజకుటుంబ బాధ్యతల నుంచి వైదొలగి, కొన్నేళ్ల క్రితం నుంచే అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ కలిసే ఉన్నప్పటికీ, వేర్వేరుగా జీవిస్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో హ్యారీ పలు కార్యక్రమాలకు ఒంటరిగా హాజరు కావడమే ఇందుకు కారణం. సెప్టెంబర్ 21, 2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విందుకు హ్యారీ ఒక్కడే హాజరయ్యాడు. ఈ సమయంలో మేఘన్ ఆయన వెంట కనిపించకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. 


Also Read : Gold-Silver Prices Today 09 Feb: ట్రంప్‌ దెబ్బకు మండుతున్న గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ