Caribbean Earthquake: కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

Caribbean Earthquake Tsunami Warning | కరేబియన్ సముద్రంలో భారీ భూకంపాలు సంభవించడంతో ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. బీచ్‌ల వైపు అసలు వెళ్లకూడదని హెచ్చరించారు.

Continues below advertisement

Tsunami Warning issued after Caribbean Earthquake | కరేబియన్‌ సముద్రంలో పలుమార్లు భూమి కంపించింది. అక్కడి కాలమానం ప్రకారం ఫిబ్రవరి 9న భారీ భూకంపం సంభవించింది. కేమన్ దీవులకు నైరుతి వైపు కరేబియన్ సముద్రంలో సంభవించిన భారీ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8గా నమోదైంది. ఫిబ్రవరి 8న రాత్రి 7.6 తీవ్రతతో భారీ భూంకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. కరేబియన్ సముద్రంలో సంభవించిన ఈ భారీ భూకంపం ప్రభావం కోస్టారికా, నికరగువా, కొలంబియా, క్యూబా దేశాలపై కనిపించింది. భారీ భూకంపం తీవ్రత దృష్ట్యా జియోలాజికల్‌ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. 

Continues below advertisement

USGS డేటా ప్రకారం కేమన్ దీవులలోని జార్జ్ టౌన్‌కు నైరుతి దిశగా 209 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. కరేబియన్ దీవులతో పాటు హోండురస్ తీరానికి సమీపంలో నివసించే ప్రజలు సునామీ ముప్పు వల్ల బీచ్‌లకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు. 2021లో హైతీలో సంభవించిన రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత భూకంపం తర్వాత ఈ ఏరియాలో ఇదే అతిపెద్ద భూకంపం అని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

సునామీ హెచ్చరికలు ఎక్కడ జారీ చేశారంటే..
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకారం, ప్యూర్టోరికో, యూఎస్ వర్జిన్ దీవులతో పాటు కేమన్ దీవులకు సునామీ హెచ్చరిక జారీ అయినట్లు AP నివేదించింది. వీటి తీర ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా బీచ్‌లు, తీర ప్రాంతం వైపు అసలు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలలో పేర్కొన్నారు. ప్రమాదకరమైన సునామీ తరంగాలు తీరంలో ఏర్పడే అవకాశం ఉంది. 

ఈ తీరాలలో సునామీ హెచ్చరికలు జారీ: జమైకా, క్యూబా, కేమన్ దీవులు, హోండురాస్, బహామాస్, హైతీ, మెక్సికో, కైకోస్,  డొమినికన్ రిపబ్లిక్, కొలంబియా, శాన్ ఆండ్రెస్ ప్రావిడెన్స్, బెలిజ్, పనామా, అరుబా, బోనైర్, కురాకో, ప్యూర్టో రికో, కోస్టా రికా, సబా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, యుఎస్ వర్జిన్ దీవులు

తీరానికి సమీపంలోని లోతట్టు ప్రాంతాల నివాసితులు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని కేమన్ దీవుల విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. 1 మీటర్ ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉంది. ప్యూర్టో రికో గవర్నర్ జెన్నిఫర్ గొంజాలెజ్ కోలన్ సైతం ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన చేశారు. అత్యవసర ఏజెన్సీలతో అధికారులు టచ్‌లో ఉన్నారని తెలిపారు. కానీ తీరం వదిలి వెళ్లాలని సిఫారసు చేయలేదు.

Also Read: Viral News: అక్కడ పది రోజుల్లో వెయ్యి భూకంపాలు - ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం - ఎక్కడో తెలుసా ? 

క్యూబా ప్రభుత్వం బీచ్ సమీపంలో నివాసం ఉండే వారిని ఆ ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. 
డొమినికన్ ప్రభుత్వం సైతం సునామీ హెచ్చరిక జారీ చేసింది.  రాబోయే కొన్ని గంటల పాటు ఓడలు, పడవలు లాంటివి ఈ దేశాల జల సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా ఉండాలని సునామీ హెచ్చరికలో సూచించారు. 

Continues below advertisement