PM Modi at G7 summit : భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ-7 దేశాల సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పర్యటన ముగించుకొని తిరిగి భారత్కు వస్తున్న సందర్భంగా మోదీ.. సదస్సుకు సంబంధించిన అంశాలపై ట్వీట్ చేశారు. సదస్సులో పాల్గొనడం తనకు అద్భుతం అనిపించిందని ట్వీట్ లో వెల్లడించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ పలువురు దేశాధినేతలతో భేటీ అయి అనేక అంశాలపై చర్చించారు. రోజంతా ఆయా దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జి-7 దేశాల ససమ్మిట్ ముగించుకుని ప్రధాని మోదీ ఇండియాకు బయలుదేరారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి తన అనుభవాన్ని ఎక్స్ లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన పేర్కొన్న విషయాలు ఇలా ఉన్నాయి. 


'ఇటలీలోని అపులియాలో జరిగిన జీ-7 సమ్మిట్ లో చాలా ఉత్పాదకమైన రోజు. ప్రపంచ నాయకులతో భేటీ అయ్యాను. పలు దేశాధినేతలతో వివిధ అంశాలపై చర్చించాను. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావంతమైన పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం మా లక్ష్యం. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం సాదరమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు' అని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. 


ఇదే సదస్సుకు హాజరైన పోప్ ఫ్రాన్సిస్ ను మోదీ కలిశారు. వీల్ చైర్ లో కూర్చున్న పోప్ ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు వీరిద్దరూ మాట్లాడారు. భారత్ లో పర్యటించాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పోప్ ను ఆహ్వానించారు.