PM Modi At G7 Summit: ఇటలీలో జరుగుతున్న G7 సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు నేతలతోనూ మోదీ కీలక అంశాలు చర్చించారు. నరేంద్ర మోదీ అధికారికంగా తన ట్విటర్ అకౌంట్‌లో ఈ భేటీలకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ఒక్కొక్క నేతతో ఏమేం చర్చించారో వివరించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో సంవత్సర కాలంలోనే నాలుగు సార్లు కలిశారు మోదీ. రెండు దేశాల మధ్య మైత్రి బలపడుతోందనడానికి ఇదే నిదర్శనమని మోదీ వెల్లడించారు. రక్షణ రంగంతో పాటు టెక్నాలజీ, AI అంశాలపైనా చర్చలు జరిగినట్టు చెప్పారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడంపైనా చర్చించినట్టు వివరించారు. వచ్చే నెల పారిస్‌లో ఒలింపింక్స్‌ జరుగుతున్నందున మేక్రాన్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు తెలిపారు ప్రధాని మోదీ. 






యూకే ప్రధాని రిషి సునాక్‌తోనూ భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ భారత్, బ్రిటన్ బంధం మరింత బలోపేతమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎప్పటిలాగే వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సెమీ కండక్టర్‌లుతో పాటు టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో పరస్పరం సహకరించుకునే దిశగా చర్చలు జరిగాయని మోదీ తెలిపారు. డిఫెన్స్ సెక్టార్‌లోనూ భాగస్వామ్యం బలపరుచుకోవాల్సిన అవసరముందని వెల్లడించారు. 






ఆ తరవాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ మోదీ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్‌ ఆసక్తిగా ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని స్థితిగతులపై ఆరా తీసిన మోదీ మానవతా కోణంలో ఆలోచించి ఈ సమస్యని పరిష్కరించుకోవాలని సూచించారు. 
 






Also Read: Kerala Schools: నాన్న వంట చేస్తే నామోషీ ఏమీ కాదు, ఆలోచింపజేస్తున్న కేరళ ప్రభుత్వం - స్కూల్ బుక్స్‌లో కార్టూన్స్‌