PM Narendra Modi: భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ దుబాయ్‌ (Dubai) వెళ్లారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఇవాళ (డిసెంబర్‌ 1) జరగనున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొననున్నారు. 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP28) సదస్సులో భాగంగా జరగనున్న క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌కు రావాలంటూ భారత ప్రధాని మోడీని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానించారు. దీంతో నిన్న రాత్రి ఢిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్లారు ప్రధాని మోడీ. దుబాయ్‌ విమానాశ్రయంలో భారత ప్రధాని మోడీకి యూఏఈ అంతర్గత మంత్రి, డిప్యూటీ ప్రధాని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు.


యూఏఈ అధ్యక్షతన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP28) సదస్సు జరగడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోడీ. వాతావరణ పరిరక్షణ అంశంలో భారత్‌కు యూఏఈ (UAE)  ముఖ్యమైన భాగస్వామిగా ఉందని చెప్పారు. ఇటీవల నిర్వహించిన జీ20 సమావేశాల్లోనూ వాతావరణ కార్యాచరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని మోడీ వివరించారు.  COP28 సమ్మిట్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌ చేరుకున్నానని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దుబాయ్‌ వెళ్లిన ప్రధాన మంత్రి మోడీ ప్రపంచ నాయకులతో సమావేశాలు  నిర్వహిస్తారని, మెరుగైన వాతావరణం తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.


ఇక... దుబాయ్‌లో ప్రధాని మోడీకి భారతీయుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని మోడీ దుబాయ్‌లో హోటల్‌కు చేరుకోగానే మోడీ.. మోడీ అంటూ నినాదాలు  చేశారు అక్కడి భారతీయులు. అబ్‌కీ బార్‌ మోడీ సర్కార్, వందేమాతరం అంటూ స్లోగన్స్‌ చేశారు. తనకు ఘనస్వాగతం పలికిన భారతీయలకు అభివాదం చేశారు ప్రధాని  మోడీ. వారిని ఆప్యాయంగా పలకరించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీ నుండి వచ్చిన ఘనస్వాగతం తనను ఎంతో కదిలించిందని ట్వీట్‌లో పేర్కొన్నారు ప్రధాని. 


కాప్‌-28 (COP28) నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షతన జరుగుతోంది. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన మార్గాలపై ఈ సమ్మిట్‌లో చరిస్తున్నారు. పలువురు ప్రపంచ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ.. మరో మూడు అత్యున్నత స్థాయి కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. 


ప్యారిస్ ఒప్పందం ప్రకారం సాధించిన పురోగతిని సమీక్షించడానికి, వాతావరణ చర్యపై భవిష్యత్ కోర్సు కోసం మార్గాన్ని రూపొందించడానికి COP28 అవకాశాన్ని కల్పిస్తుందని  ప్రధాని మోడీ తెలిపారు. వాతావ‌ర‌ణ మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చ‌ర్యల విష‌యంలో భార‌త‌దేశం ముందు ఉందన్నారు ప్రధాని మోడీ. పునరుత్పాదక ఇంధనం,  ఇంధన సామర్థ్యం, అడవుల పెంపకం, ఇంధన పొదుపు, మిషన్ లైఫ్ వంటి వివిధ రంగాల్లో భారత్‌ సాధించిన విజయాలు మాతృభూమి పట్ల ప్రజల నిబద్ధతకు నిదర్శనమని  అన్నారాయన. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయత్నాలకు తగిన క్లైమేట్ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో మద్దతివ్వడం చాలా ముఖ్యమని గట్టిగా చెప్పారు ప్రధాని మోడీ.