Airplane Crash : అమెరికాలోని వాషింగ్టన్ లోని రొనాల్డ్  రీగన్‌ విమానాశ్రయం సమీపంలో ఓ విమానం, హెలికాప్టర్ పొటోమాక్ నదిలో కుప్పకూలాయి. రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే క్రమంలో  పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం గాలిలో ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ ఆన్లైన్ లోనూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తాజా ఘటనతో రోనాల్డ్ రీగన్ నేషనల్ విమానాశ్రయంలోని మిగతా అన్ని విమానాల టేకాఫ్ లో, ల్యాండింగ్ లు నిలిపివేశారు. 






అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ - పీఎస్ఏ నిర్వహిస్తోంది. ఈ ఫ్లైట్ అమెరికన్ కాలమానం ప్రకారం, బుధవారం రాత్రి  8:30కి విచిత నుండి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇది ఈరోజు రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉండగా.. రన్‌వే వద్దకు చేరుకునే సమయంలోనే హెలికాప్టర్‌ను ఢీకొట్టిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో విమానంలో 60మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది కూడా ఉన్నట్టు ఎయిర్ లైన్స్ వెల్లడించింది. బొంబార్డియర్ CRJ-700 అనే ప్రాంతీయ విమానం, రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ సైనిక విమానంను ఢీకొట్టినట్టు ఎఫ్ఏఏ తెలిపింది. హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులున్నారని, వీఐపీలు ఎవరూ లేరని అధికారులు తెలిపారు. గగనతలంలో ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్ధాన్ని గుర్తించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.






వాషింగ్టన్ డీసీ పోలీసుల పోస్ట్ ప్రకారం, పోటోమాక్ నదిపై ఈ ప్రమాదం జరిగింది. అనేక ఏజెన్సీలు ప్రస్తుతం పోటోమాక్ నదిలో సెర్చింగ్, రెస్క్యూ ప్రయత్నాలను నిర్వహిస్తున్నాయి. క్రాష్ ఫలితంగా రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ అన్ని టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లను నిలిపివేసినట్లు రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపింది. అయితే ఇప్పటివరకు ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలేవీ తెలియలేదు. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.


Also Read : WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు