WhatsApp governance in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో నేటి (జనవరి 30) నుంచి వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి రానుంది. దీనిద్వారా మొదటి విడతగా 161 సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి, పౌరులకు అవసరమైన సమాచారం అందించడం, ధ్రువపత్రాల జారీ లాంటి పలు సేవలు ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తొలి విడతగా పౌరులకు 161 సేవలను కూటమి ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు సచివాలయంలో సమీక్షలో ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను ఏ విధంగా పొందవచ్చో దానిపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొదటి విడతలో ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, దేవాదాయ, ఎనర్జీ, సీఎంఆర్ఎఫ్, అన్నక్యాంటీన్, మున్సిపల్ వంటి పలు శాఖల్లో సుమారు 161 సేవలను పౌరులకు అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ల జారీ
వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని దేశంలోనే మొదటిసారి ప్రవేశపెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇకనుంచి ధ్రువపత్రాల కోసం ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలికింది కూటమి ప్రభుత్వం. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ని బలోపేతం చేయాలన్నారు. ఏపీని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రభుత్వ సేవలను పౌరులకు వేగంగా అందించడాన్ని వాట్సాప్ గవర్నెన్స్ విధానం సులభతరం చేసింది. ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గురువారం నాడు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అధికారికంగా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.