4 Days Work -3 Days Rest: మన దేశంలో.. వారానికి 90 గంటలు పని చేయండి, 70 గంటలు ఆఫీసుల్లో కష్టపడండి, ఆదివారం నాడు ఇంట్లో ఊరికే కూర్చుని భార్య ముఖం ఎంతసేపు చూస్తారు, ఆఫీస్‌కు వచ్చి పని చేయండి అంటూ కొందరు కార్పొరేట్ పెద్దలు ఉచిత సలహాలు ఇచ్చారు. తమ దగ్గర పని చేసే ఉద్యోగులను "కార్పొరేట్ బానిసలు" (Corporate Slaves)గా మార్చాలన్న పారిశ్రామికవేత్తల ఆలోచనలకు ప్రతిరూపాలు ఈ ప్రకటనలు. ఇదే తరుణంలో, బ్రిటన్‌లోని 200 కంపెనీలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఆ నిర్ణయం ప్రకారం, ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ పని - వ్యక్తిగత జీవిత సమతుల్యత (Office work - Personal life balance)ను మెరుగుపరచడం & ఉద్యోగి సంతృప్త స్థాయిని పెంచే లక్ష్యంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త పని విధానం వల్ల మార్కెటింగ్, టెక్నాలజీ, ఛారిటీ వంటి వివిధ రంగాలలో పనిచేస్తున్న 5,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
కొత్త యుగం - కొత్త నియమం
ఉద్యోగుల జీవన నాణ్యత (Quality of life)ను మెరుగుపరచడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం. నాలుగు రోజుల పని వారాన్ని (4-Day Work Week) స్వీకరిస్తున్న కంపెనీలు, పాత ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేందుకు ఇది మంచి మార్గమని నమ్ముతున్నాయి. "ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పని విధానం (9 am to 5 pm work culture) 100 సంవత్సరాల క్రితం ఉద్భవించింది, ఇది ఆధునిక కాలానికి తగినది కాదు" అని ఆధునిక యుగ వ్యాపారవేత్తలు & పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నట్లు 'ది గార్డియన్' రిపోర్ట్ చేసింది. నూతన మార్పు వల్ల ఉద్యోగులకు 50 శాతం ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుందని, తద్వారా వాళ్లు తమకు ఇష్టం వచ్చినట్లు కుటుంబంతో కలిసి సంతోషంగా, సంతృప్తిగా జీవించగలుగుతారని భావిస్తారు. అదే ఉత్సాహంతో తిరిగి ఆఫీస్‌కు వస్తారని, ఫలితంగా ఉద్యోగుల ఉత్పాదకత (Employee productivity) పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, వారంలో 4-రోజుల పని విధానాన్ని ఇప్పటికే స్వీకరించిన కొన్ని కంపెనీల్లో ఇది నిరూపితమైంది కూడా.
నాలుగు రోజుల జీతమే వస్తుందా?
4-డే వర్క్ వీక్‌లో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పని దినాలు తగ్గినంత మాత్రాన జీతం తగ్గదు. వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసినా ఉద్యోగుల జీతాల్లో కోత ఉండదు, నెలజీతం యథాతథంగా బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. దీనివల్ల ఉద్యోగులు ఎలాంటి ఆర్థిక ఆందోళనలు లేకుండా తమ పనిపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకే కాకుండా, ఉద్పాదకత పెరుగుదల ద్వారా కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూర్చే ఈ విధానాన్ని అమలు చేసేందుకు చాలా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.
70, 90 గంటల పని విధానాలకు తగిన సమాధానం
ఈ 200 బ్రిటీష్ కంపెనీల నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా భారతదేశంలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు 70 నుంచి 90 గంటలు పని చేయాలని ఆశిస్తున్న తరుణంలో ఇదొక గొప్ప సమాధానంగా మారింది. బ్రిటిష్ కంపెనీలు తీసుకున్న చొరవ ఉద్యోగులకు ఉపశమనం కలిగించడమే కాకుండా, పని- వ్యక్తిగత జీవిత సమతౌల్యానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో ఇతర దేశాల కంపెనీలకు కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!