Telegram CEO: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ సహ వ్యవస్థాపకుడు, CEO అయిన పావెల్ దురోవ్ ఆసక్తికర పోస్టుతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. తాను 12 దేశాలలో 100 మంది పిల్లలకు జీవసంబంధమైన తండ్రిని (Biological father ) అని పేర్కొన్నారు. తన సుదీర్ఘ పోస్ట్‌లో, దురోవ్ తన గురించి చెబుతూ గతంలో తాను చురుకైన స్పెర్మ్ దాతగా ఉన్నానని వెల్లడించారు. తన టెలిగ్రామ్ ఛానెల్‌లో దురోవ్‌కు 5.82 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్ లు ఉన్నారు. టెలిగ్రామ్‌లో రాసిన ఈ పోస్ట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
స్పెర్మ్ డోనర్‌గా ఎలా మారానంటే...
22 సంవత్సరాల వయస్సులోనే రష్యా అతిపెద్ద సోషల్ నెట్‌వర్క్ Vkontakteని సృష్టించిన ఈ 39 ఏళ్ల దురోవ్, తన DNA ను "ఓపెన్ సోర్స్" చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించే వ్యక్తికి ఇంతమంది పిల్లలు ఎలా పుట్టారనుకుంటున్నారా..? ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. తాను స్పెర్మ్ డోనర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా పంచుకున్నాడు. తన ఫ్రెండ్ కారణంగా తాను స్పెర్మ్ డోనర్‌గా మారానని అప్పటి సంగతులను పంచుకున్నాడు. పదిహేనేళ్ల క్రితం తనకు తన స్నేహితుడి నుంచి క్లీనిక్‌కు రావాలని ఫొన్ వచ్చిందని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లాక తనను స్పెర్మ్ డొనేట్ చేయమని అడగడంతో నవ్వుకున్నానని అన్నాడు. తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, కానీ తనకు తన భార్యకు పిల్లలు కావాలని కాసేపయ్యాక తన ఫ్రెండ్ చాలా సీరియస్‌గా తన పరిస్థితిని వివరించాడని దీంతో స్పెర్మ్ డోనర్‌గా మారాల్సి వచ్చిందన్నారు.
బయట నాణ్యత గల ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత ఉందని, ఆరోగ్యవంతులు ముందుకొచ్చి స్పెర్మ్ దానం చేసి బిడ్డలు లేని జంటలకు సాయం చేయాలని కోరాడు. అయితే ఇప్పటికే తాను స్పెర్మ్ డొనేట్ చేయడం ఆపేసి చాలాకాలం అయ్యిందని, కానీ ప్రపంచంలో ఏదొక IVF సెంటర్‌లో తన స్పెర్మ్ తప్పకుండా అందుబాటులో ఉండే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇప్పుడెందుకు బయటపెట్టినట్టు..?
తన జీవసంబంధమైన పిల్లలందరూ ఒకరినొకరు మరింత సులభంగా కనుగొనగలిగేలా తన DNAని ఓపెన్ సోర్స్ చేయాలని యోచిస్తున్నట్లు పావెల్ దురోవ్ తన పోస్ట్‌లో చెప్పారు. అయితే దీనిలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని అంగీకరించారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆరోగ్యకరమైన స్పెర్మ్ కొరత పెద్ద సమస్యగా ఉందని చెప్పారు. తాను స్పెర్మ్ డోనర్ అని చెప్పుకోవడానికి సంకోచించడం లేదని చెప్పిన ఆయన, తన వంతుగా చాలా మంది జంటలకు పిల్లలు కలిగేందుకు సాయం చేశానని చెప్పుకొచ్చాడు.