Emergency Landing: ర‌ష్యాలో ఓ విమానం పొలాల్లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) అయ్యింది. 170 మంది ప్రయాణికుల‌తో వెళ్తున్న విమానం అత్యవ‌స‌రంగా పొలాల్లో దిగింది. ఉర‌ల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం మంగళవారం నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వ‌ద్ద ఉన్న పొలాల్లో ల్యాండింగ్ అయ్యింది. వివరాలు.. ఉర‌ల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బ‌స్ ఏ320 విమానం సోచి నుంచి 170 మంది ప్రయాణికులతో ఓమ్స్క్‌కు బయల్దేరింది. మార్గ మధ్యలో ఎమ‌ర్జెన్సీ సందేశం రావ‌డంతో విమానాన్ని నోవోసిబిర్క్స్‌కు పంపే ప్రయ‌త్నం చేశారు.


ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ విమానం ర‌న్‌వే వ‌ర‌కు వెళ్లక‌పోయింది. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. తమకు భూమిపై నూకలు ఉన్నాయో లేదో అని రోదించారు. దేవుడా మమల్ని కాపాడు అంటూ వారు చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడేమో, పైలెట్ రూపంలో వారిని సురక్షితంగా భూమిపై దించారు. విమానాన్ని పైలట్ కామెనేకి గ్రామం వ‌ద్ద గోధుమ పొలంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ గ్రామం నోవోసిబిర్క్స్‌కు సుమారు 180 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. హైడ్రాలిక్స్ లోపం తలెత్తడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 170 మందితో వెళ్తున్న ఆ విమానంలో 23 మంది చిన్నారులు కూడా ఉన్నారు. 


హైడ్రాలిక్స్ లోపం తలెత్తినా పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని పొలంతో సేఫ్ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు పైలెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదృష్టవశాత్తూ ఎమ‌ర్జెన్సీగా పొలంలో దిగినా ఆ విమానం ముక్కలు కాలేదు. అగ్నిప్రమాదం కూడా జ‌ర‌గ‌లేదు. విమానం ఆగిపోయిన తరువాత ప్రయాణికులు అంద‌రూ సుర‌క్షితంగా బ‌య‌కు వ‌చ్చారు. ఆ పొలాల్లోనే ప్రస్తుతం వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. వారిని తరలించేందుకు ఎయిర్ లైన్స్ సంస్థ, ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నాయి.


ఆగస్టులో జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి
రష్యాలో ఆగస్టు 23న మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న ప్రైవేటు జెట్‌ కూలి 10 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యా అనుకూల కిరాయి సైనిక ముఠా వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ కూడా మృత్యువాతపడ్డారు. ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కూడా ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. అతని సొంత విమానమని చెబుతున్న సదరు ప్రైవేట్‌ బిజినెస్‌ జెట్‌ రష్యా రాజధాని మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్‌ ప్రాంతంలో కుప్పకూలింది. మృతుల్లో వారిలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కుప్పకూలిన జెట్‌ ప్రిగోజిన్ పేరున ఉన్నట్లు సమాచారం.  ప్రిగోజిన్ విమానం కుప్పకూలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఎవరీ ప్రిగోజిన్..?
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్‌ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్‌ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్‌ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్‌ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్‌ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్‌ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్‌ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్‌ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్‌ పాత్ర కూడా బయటకు వచ్చింది.