Pakistan to Block X: పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఆ దేశంలో కొద్ది రోజుల పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విటర్) ని తాత్కాలికంగా బ్లాక్ చేసింది. నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాత్కాలిక నిషేధమే అని చెప్పినా..ఈ బ్యాన్ ఎక్కువ రోజుల పాటు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ట్విటర్‌పై పెద్ద ఎత్తున పాక్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది యూజర్స్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అయితే...అధికారికంగా ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. హోంశాఖకు చెందిన అధికారులు మాత్రం ఈ మేరకు సంకేతాలిచ్చారు. తమ ప్రభుత్వ నిబంధనల మేరకు ట్విటర్ పని చేయడం లేదని, ఈ ప్లాట్‌ఫామ్ చాలా దుర్వినియోగం అవుతోందని స్పష్టం చేశారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నిషేధం విధించాల్సి వస్తోందని వివరించారు. తమ దేశ చట్టాలకు లోబడి ఉండడంలో X పూర్తిగా విఫలమైందని తేల్చి చెబుతున్నారు. అయితే...దీనిపై X ఇంకా స్పందించలేదు.