Pakistan Prime Minister Anwaar-ul-Haq Kakar: పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి (Pakistan Prime Minister) అన్వర్-ఉల్-హక్ కాకర్ (Anwaar-ul-Haq Kakar) లవ్ గురు (Love Guru)గా మారారు. ప్రేమ, పెళ్లి, డబ్బు, కుటుంబ సంబంధాలపై అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన జవాబులు చెప్పారు. ఓ వ్యక్తికి 82 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను వివాహమాడవచ్చని సమాధానమిచ్చారు. అది కాస్తా సోషల్ మీడియా(Social Meda)లో వైరల్ అవుతోంది.
న్యూఇయర్ సందర్భంగా పాక్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. అందులో ప్రజలు అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో బదులిచ్చారు. ఓ వ్యక్తికి 52 ఏళ్లు వచ్చినప్పటికీ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా? అని ఓ వ్యక్తి అడగగా.. మీకు 82 ఏళ్లు వచ్చినా నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని సమాధానమిచ్చారు. ఒకరికి పిచ్చి అత్తగారు ఉంటే ఏం చేయాలని అడిగితే.. ప్రధాని స్పందిస్తూ, బహూశా ‘‘క్రైసిస్ మేనేజ్మెంట్ కోర్సు’’కి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు.
డబ్బు లేకుండా ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏమి చేయాలి అనే మరో ప్రశ్నకు కాకర్ స్పందిస్తూ.. తన జీవితంలో ఎవరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదని అన్నారు. కానీ చాలా మంది తనను ఇంప్రెస్ చేశారని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం వచ్చి ప్రేమను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలని అడిగినప్పుడు.. 'అనుకోకుండా ప్రేమను పొందవచ్చు.. మీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం పొందారని నేను అనుకుంటున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు.' అని కాకర్ స్పందించారు.
అన్వర్-ఉల్-హక్ కాకర్ సమాధానాలపై నెటిజన్లు తమదైన శైళిలో స్పందిస్తున్నారు. మార్కెట్‌లోకి కొత్త లవ్ గురు వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. కాకర్‌లో ఒక ప్రధానమంత్రి, ఒక రాజకీయ నాయకుడి కంటే లవ్ గురువు ఎక్కువగా కనిపిస్తున్నాంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత కాకర్ క్వెట్టాలోని ప్రిన్స్ రోడ్‌లో మ్యారేజ్ బ్యూరోని తెరవాలంటూ మరి కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ నిత్యావసర ధరలు ఆకాశాన్నంటున్నాయి. ప్రజలు గోదుమ పిండి కోసం ట్రక్కుల వెంట పరుగులు పెడుతున్నారు. పెట్రోల్, తిండి గింజల ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్-హక్ కాకర్‌ను ఎంపిక చేశారు. పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి.
భారత్‌పై 300 సార్లు యుద్ధం చేస్తాం
గతంలో పాక్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ భారత్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తిరిగి తీసుకురావడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో తన అక్కసును వెళ్లగక్కాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ విషయం ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఉందంటూ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితికి వ్యతిరేకంగా భారత్ నిర్ణయం తీసుకుంటే, కాశ్మీర్ కోసం 300 సార్లు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు చైనా సైతం వంత పాడింది. కాశ్మీర్, లఢక్ రెండూ భారత భూభాగానికి చెందిన ప్రాంతాలు కావంటూ చైనా విషం కక్కింది.