Kashmir Terrorist Attack | ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పాకిస్తాన్ వణికిపోతోంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో, భారత్ తమ మీద దాడి చేయడం ఖాయమని పాక్ మంత్రులు చెబుతున్నారుు. భారతదేశం మరో 24 నుండి 36 గంటల్లో పాకిస్తాన్ మీద సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని.. తమకు రహస్య సమాచారం ఉందని పేర్కొంది. భారతదేశం తమపై దాడికి పాల్పడితే కనుక అందుకు తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సైతం హెచ్చరించింది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనిక అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం తర్వాత కొన్ని గంటలకు పాక్ ఇలాంటి ప్రకటనలు చేసింది. పహల్గాంలో గత వారం జరిగిన ఉగ్రవాద దాడికి ఎలా, ఎప్పుడు స్పందించాలో నిర్ణయించుకునే పూర్తి స్వాతంత్ర్యాన్ని సైన్యానికి ఇచ్చారు ఇచ్చారు ప్రధాని మోదీ. పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఉగ్రవాదులు, బాధ్యులు తప్పించుకోలేరన్న మోదీ

పహల్గాం ఉగ్రదాడి కారణమైన వ్యక్తులు, వారికి మద్దతు ఇచ్చిన వారు భారత్ నుంచి తప్పించుకోలేరని, వారిని వదిలిపెట్టేది లేదని ఇటీవల ప్రధాని మోదీ అన్నారు. బిహార్ పర్యటనలో ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతాం, బాధ్యులను తమ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరికలు పంపారు. దాడి అనంతరం భారతదేశం పాకిస్తాన్‌పై దౌత్య ఒత్తిడిని తీవ్రతరం చేసింది. లష్కర్-ఎ-తోయిబాకు అనుబంధంగా ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ దాడికి బాధ్యత వహించింది. తరువాత అది తమ ప్రకటన కాదని మరో ప్రకటన చేసింది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. దాడి జరిగిన సమయంలో అక్కడున్న వారిని, ఆ ప్రాంతంలో తిరిగిన వారిని ప్రశ్నించి.. ఘనటకు సంబంధించి వివరాలు సేకరిస్తోంది.

పాక్ కు ఏమైనా జరిగితే భారతదేశానిదే పూర్తి బాధ్యత: పాకిస్తాన్ మంత్రి

పాకిస్తాన్ సమాచార మంత్రి అట్టాఉల్లా తారర్ బుధవారం ఉదయం 2 గంటల ప్రాంతంలో ఓ వీడియో విడుదల చేశారు. నిరాధారమైన ఆరోపణలతో భారతదేశం పాకిస్తాన్ మీద సైనిక చర్యకు సన్నద్ధమవుతోందని ఆరోపించారు. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాద బాధిత దేశమని, అన్ని రకాల ఉగ్రవాదాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. నిష్పాక్షికంగా అంతర్జాతీయ సంస్థ నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సైతం పాక్ ప్రభుత్వం ప్రతిపాదన చేసినట్లు ఆయన గుర్తుచేశారు. కానీ భారతదేశం మాత్రం పాక్ ప్రతిపాదనను తిరస్కరించింది అని నివేదికలో పేర్కొందన్నారు. భారతదేశం చేసే ఏ సైనిక చర్యకైనా పాకిస్తాన్ నుంచి అదే స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఉద్రిక్తతలు తీవ్రమైతే కనుక దాని పర్యవసానాలకు భారతదేశం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 

దశాబ్దాల నాటి ఇండస్ జల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ సైనిక అటాచేలను బహిష్కరించడం, ఏప్రిల్ 27 తర్వాత జారీ చేయబడిన పాకిస్తాన్ పౌరులకు జారీ చేయబడిన అన్ని వీసాలను రద్దు చేయడం మరియు అట్టారి భూ సరిహద్దు దాటడాన్ని మూసివేయడం వంటి అనేక బలమైన ప్రతీకార చర్యలను భారతదేశం ప్రవేశపెట్టింది.