Nobel Prize 2023 in Chemistry:
రసాయన శాస్త్రంలో అత్యుత్తమ సేవలు అందించిన ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు వరించింది. కెమిస్ట్రీలో ఈ ఏడాదికి గానూ ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను అమెరికా శాస్త్రవేత్తలు మౌంగి బవెండి, లూయిస్‌ బ్రూస్‌, అలెక్సీ ఎకిమోవ్‌ లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. క్వాంటమ్ డాట్స్ కనుగొనడంతో పాటు వాటి విశ్లేషణపై ప్రయోగాలు చేసినందుకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది.


అతి సూక్ష్మమైన నానో పార్టికల్స్ ఈ క్వాంటమ్ డాట్స్. వీటిని కనుగొనడం, విశ్లేషించడంలో పరిశోధనలు చేసినందుకుగానూ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను కెమిస్ట్రీలో నోబెల్ వరించింది. క్వాంటమ్ డాట్స్ ను టీవీలు, ఎల్.ఈ.డీ లైట్లు లాంటి ఎన్నో ఎలక్ట్రిక్ పరికరాలలో వినియోగిస్తున్నారు. డాక్టర్లు ట్యూమర్ కణాలను తొలగించేందుకు సైతం ఈ టెక్నాలజీ వాడుతున్నారని రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.


నోబెల్ ను వదలని లీకుల బెడద!
గతంలో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీల అజెండా, సినిమా సీన్లు, స్టోరీలు లీకయ్యేవి. కానీ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డుల విజేతల వివరాలు అధికారిక ప్రకటనకు కొన్ని గంటలకు ముందే  మీడియాలో లీకయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో కెమిస్ట్రీ నోబెల్ విజేతల వివరాలు అందరికీ తెలిసిపోయాయి. స్వీడన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ, రేడియోలో నోబెల్ విజేతల వివరాలు లీకయ్యాయి. అయితే రాయల్ స్వీడిష్ అకాడమీ నుంచి ప్రెస్ నోట్ వచ్చిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. 


భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే..
ఈ ఏడాది నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటిస్తున్నారు. భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వరించింది. జర్మనీకి చెందిన ఫెరెన్స్‌ క్రౌజ్‌, అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌ హ్యులియర్‌కు ఈ ఏడాది ఫిజిక్స్ లో నోబెల్‌ బహుమతి ప్రకటించారు. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ మంగళవారం ఈ అవార్డును ప్రకటించింది.


అణువుల్లో ఎలక్ట్రాన్‌ డైనమిక్స్‌ను అధ్యయనం చేయడంలో భాగంగా కాంతి తరంగాల ఆటోసెకండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేయడంపై చేసిన పరిశోధనలకుగానూ పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్‌ క్రౌజ్‌, ఎల్‌ హ్యులియర్‌ లకు భౌతికశాస్త్రంలో నోబెల్ అందజేస్తు్న్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ తెలిపింది. వీరి పరిశోధనలతో పరమాణువులు, అణువులలో ఎలక్ట్రాన్స్ గురించి మరింత అధ్యయనం చేసేందుకు నూతన ఆవిష్కరణలు వచ్చాయని పేర్కొన్నారు. అయితే ఫిజిక్స్ విభాగంలో నోబెల్ పొందిన 5వ మహిళా శాస్త్రవేత్తగా హ్యులియర్ నిలిచారు.


వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
కరోనా సమయంలో విశేష కృషి చేయడంతో పాటు కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరిద్దరూ ఎంతో కృషి చేశారు. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలకు గానూ స్వీడన్ లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు.