Earthquake In Nepal: 


నేపాల్‌లో 2015న వచ్చిన భూకంపం నాటి విషాదఛాయలు ఇప్పటికీ అక్కడి ప్రజలను కలవరపెడుతూనే ఉంటాయి. అయితే.. దానికి మించిన ప్రకృతి విలయం రాబోతోందని  హెచ్చరిస్తున్నారు నిపుణులు. నేపాల్‌లో నెల రోజుల్లో మూడు సార్లు భూమి కంపించింది. నిన్న రాత్రి వచ్చిన బలమైన ప్రకంపనలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది  మందిని మింగేశాయి. నేపాల్ భూకంపం ప్రభావం ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం కనిపించింది. అయితే... ఇది అంతం కాదని అంటున్నారు నిపుణులు. నేపాల్‌లో  మరిన్ని భారీ భూప్రకంపనలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. 


హిమాలయాలు, నేపాల్ మధ్య ప్రాంతంలోని ప్రజలు మరిన్ని భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. నిన్న  అర్థరాత్రి వచ్చిన భూ ప్రకంపనల మూలం నేపాల్‌లోని దోటీ జిల్లాకు సమీపంలో ఉందని ఆయన తెలిపారు. నిన్న ఒకే ప్రాంతంలో వరుసగా పలుమార్లు ప్రకంపనలు వచ్చాయని  చెప్పారు. భూకంపం వచ్చిన ఈ ప్రాంతం నేపాల్ మధ్య భాగంలో ఉందని... అది ఆందోళన కలిగించే విషయమని అంటున్నారు భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్.


నవంబర్ 2022లో నేపాల్‌లోని దోటీ జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న (అక్టోబర్‌ 3న) నేపాల్‌ను తాకిన వరుస భూకంపాలు కూడా ఇదే ప్రాంతంలో  ఉన్నాయి. నేపాల్ సెంట్రల్ బెల్ట్ నిరంతర శక్తి విడుదల రంగంగా గుర్తించబడిందని.. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు భూకంప శాస్త్రవేత్తలు. హిమాలయాలకు  సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో భారతీయ టెక్టోనిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ ఢీకొన్నందున ఆ ప్రాంతంలో ఎప్పుడైనా పెను భూకంపం వచ్చే అవకాశం ఉందని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనే కాదు... చాలా మంది నిపుణులు అనేక సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 


నాలుగైదు మిలియన్ సంవత్సరాల క్రితం, భారతీయ పలక హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరం వైపు కదులుతున్నప్పుడు, యురేషియన్ ప్లేట్‌తో ఢీకొని హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే... మరోసారి భారత పలక ఉత్తరం వైపు కదలడం ప్రారంభించిందని నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా.. హిమాలయాల కింద భూమిలో ఒత్తిడి పెరుగుతుందని... దీని వల్ల అతి భారీ భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ భూకంపాల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 8 పాయింట్ల కంటే ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. అయితే... ఆ భారీ వైబ్రేషన్స్‌ ఎప్పుడు వస్తాయో మాత్రం కచ్చతంగా అంచనా వేయలేకపోతున్నామని అంటున్నారు భూకంప శాస్త్రవేత్తలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అతి భారీ భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు.


నేపాల్‌లో ఇవాళ తెల్లవారుజామున కూడా నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. మృతుల కుటుంబాలకు నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌ ప్రచండ సంతాపం  ప్రకటించారు. వైద్య బృందంతో కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ భూకంపంలో జజర్‌కోట్‌ జిల్లాలోని నల్‌గఢ్‌ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్‌ సరితా సింగ్‌ కూడా  మృతిచెందారు. భూకంప ధాటికి ఆమె ఉంటున్న ఇల్లు కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విపత్కర  పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా ఉంటామని చెప్పారు.