Pakistan Air Force:


ఎయిర్ ఫోర్స్ బేస్‌పై ఉగ్రదాడి..


పాకిస్థాన్‌లోని మియాన్‌వలీలో ఎయిర్‌ ఫోర్స్ బేస్‌పై (Mianwali Attack) ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులతో పంజాబ్ ప్రావిన్స్‌ ఉలిక్కిపడింది. ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రయత్నించినట్టు పాక్ ప్రకటించింది. ఐదారుగురు ఉగ్రవాదులు ఒకేసారి వచ్చి దాడులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పాక్ ఆర్మీ ఎదురు దాడికి దిగింది. ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. ఉగ్రవాదులంతా భారీ ఆయుధాలతో ఎయిర్ ఫోర్స్‌ బేస్‌పై దాడికి దిగినట్టు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (Pakistan Air Force) వెల్లడించింది. 


"నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున ఉగ్రవాదులు మియాన్‌వలీ ఎయిర్‌ ఫోర్స్ బేస్‌పై దాడులకు దిగారు. ట్రైనింగ్ ఎయిర్‌ బేస్‌ని టార్గెట్‌గా చేసుకున్నారు. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌ వెంటనే అప్రమత్తమైంది. ఆ దాడుల్ని కట్టడి చేసింది. బేస్‌లో ఉన్న వాళ్లతో పాటు ఆయుధాలనూ రక్షించుకుంది. ఉగ్రవాదులు ఉన్నట్టుండి కాల్పులు మొదలు పెట్టారు. పాక్ కూడా ఎదురు దాడికి దిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగతా ముగ్గురు ఉగ్రవాదులూ ఎటూ తప్పించుకుని వెళ్లకుండా కట్టడి చేయగలిగాం. తక్షణమే స్పందించడం వల్ల ఉగ్రవాదుల ఆటలు చెల్లలేదు"


- పాకిస్థాన్ ఆర్మీ




ఈ దాడుల్లో పాక్‌ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన మూడు విమానాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రాంతంపై ఆర్మీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అయితే...ఈ దాడులు చేసింది తామే అని పాకిస్థాన్‌కి చెందిన తెహరీక్‌ ఏ జిహాద్ పాకిస్థాన్ (Tehreek-e-Jihad Pakistan) ప్రకటించింది.