MEA News: హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడులు చేస్తున్న వేళ.. ఆ ఉగ్రసంస్థ అధినేత హసన్ నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు లెబనాన్ తెలిపింది. ఈ మేరకు అమెరికా, ఫ్రాన్స్ ద్వారా ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చామని లెబనాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ కూడా 21 రోజుల సీజ్‌ఫైర్‌కు అంగీకారం తెలిపారని స్పష్టం చేసింది. ఒప్పందానికి అంగీకరించిన కూడా కాసేపటి తర్వాత నస్రల్లాను ఇజ్రాయెల్ చంపిందని లెబనాన్ విదేశీ వ్యవహారాల శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది.


సీజ్‌ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాతే నస్రల్లా హత్య జరిగిందా? :


            లెబనాన్‌ వార్‌పై ఆ దేశ మంత్రి అబ్దుల్లా బౌ హబీబ్ సంచలన విషయాలు వెల్లడించారు. హెజ్బొల్లా స్థావరాలు లక్ష్యంగా చేసుకొని గతవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం భీకర దాడులు జరిపింది. ఆ సమయంలో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు లెబనాన్ మంత్రి హబీబ్ పేర్కొన్నారు. హెజ్‌బొల్లాతో లెబనాన్ హౌజ్‌ స్పీకర్ నబిహ్ బెర్రీ సంప్రదింపులు జరగ్గా నస్రల్లా అంగీకరించారని, ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా అమెరికా, ఫ్రాన్స్‌కు తెలియ చేసినట్లు హబీబ్ చెప్పారు. ఆ దేశాధ్యక్షులతో సీజ్‌ఫైర్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ అంగీకారం తెలిపినట్లు తమకు సమాచారం కూడా వచ్చిందన్నారు. 21 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అంగీకారం జరిగిందని హబీబ్‌ అన్నారు. దీనిని యూరోపియన్ యూనియన్‌తో పాటు అరబ్‌ దేశాలు మద్దతు తెలిపినట్లు తమకు సమాచారం అందిందని అన్నారు.  అయితే ఇంతలోనే ఇజ్రాయెల్ ఆ అంగీకారాన్ని పక్కన పెట్టి నస్రల్లాను వైమానిక దాడుల ద్వారా చంపేసిందని వివరించారు.


నెతన్యాహూ కాల్పుల విరమణకు అంగీకారం తెలపలేదా?


            ఇజ్రాయెల్ మాత్రం ఈ కాల్పుల విరమణకు ససేమిరా అన్నట్లు తెలసింది. అమెరికా- ఫ్రాన్స్ అధ్యక్షుల సంయుక్త ప్రకటనను బెంజిమెన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. ఇజ్రాయెల్ ప్రజల సంరక్షణే తమ ధ్యేయమని స్ఫష్టం చేసిన బెంజిమన్, నస్రల్లా హత్యకు వ్యక్తిగతంగా ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని ఆయనే తర్వాత వెల్లడించారు. నెతన్యాహూ నుంచి వచ్చిన ఆదేశాలతో తమ దగ్గర ఉన్న ఇంటెల్ సాయంతో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడులు జరిపి ఐడీఎఫ్‌ నస్రల్లాను హతమార్చింది. అయితే హెజ్బొల్లా కమాండర్లు ఒకరి తర్వాత ఒకళ్లుగా చనిపోతూ ఉండడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ముందుగానే హసన్ నక్రల్లాను హెచ్చరించినట్లు తెలిసింది. త్వరగా సురక్షితమైన రహస్య ప్రదేశానికి వెళ్లాలని సూచించారు. అయితే ఈ సందేశాన్ని మోసుకెళ్లిన ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కూడా బంకర్లో నస్రల్లాతో పాటే ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.


ఇరాక్‌లో వంద మంది పిల్లలకు నస్రల్లా పేరు:


            గత వారం బైరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళాలు జరిపిన భీకర దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతడికి నివాళిగా ఇరాక్‌లో వంద మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టారు. ఈ మేరకు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నీతివంతుడైన నస్రల్లా అమరవీరుడు అంటూ ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీ వ్యాఖ్యానించారు. గతవారం మృత్యువాత పడ్డ నస్రల్లా అంత్యక్రియలు నేడు (అక్టోబర్ 3) న నిర్వహించేందుకు లెబనాన్ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.