Voyager 2: నాసా ప్రయోగించిన వాయేగర్ 2 ప్రోబ్ మిషన్ సిగ్నల్స్ ఇటీవల తెగిపోయాయి. అయితే తాను ఇంకా ఉన్నానంటూ వాయేగర్-2 భూమికి సిగ్నల్ పంపినట్లు అమెరికా స్పేస్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. వాయేగర్‌ను 1977లో ఇతర గ్రహాలపై పరిశోధలను, విశ్వంలో మానవాళికి సేవలు అందించేందుకు దీనిని ప్రయోగించారు. ఇది భూమికి 19.9 బిలియన్ల కిలోమీటర్ల దూరంలో తిరుగుతోంది


జూలై 21న వాయేజర్ 2కి పంపిన కమాండ్లు అనుకోకుండా యాంటెన్నా భూమికి రెండు డిగ్రీల దూరంలో ఉండేలా చేసిందని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) ఇటీవలే  తెలిపింది. దీంతో డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి, మిషన్‌ను కంట్రోల్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అక్టోబర్ 15న రీ ఓరియంటేషన్ మన్యువర్ నిర్వహించే వరకు పరిస్థితి ఇలాగే ఉండనుంది. 


దీనిపై వాయేగర్ ప్రాజెక్ట్ మేనేజర్ సుజానే డాడ్ మాట్లాడుతూ.. డీప్ స్పేస్ నెట్ వర్క్, అంతర్జాతీయ రేడియో యాంటీనాలు, భూ కక్షలో ఉన్న మరి కొన్నింటితో కలిపి కాంటాక్ట్‌ను పునరుద్ధరించేందుకు చివరిసారి యత్నిస్తామన్నారు. అయితే వాయేగర్ నుంచి వచ్చిన సిగ్నల్స్‌తో అది సజీవంగా ఉందని, అది పని చేస్తోందని, ఆ సిగ్నల్స్ తమలో మరింత ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. 


ప్రస్తుతం శాస్త్రవేత్తల బృందం స్పేస్ క్రాఫ్ట్ యాంటెనాను భూమి వైపు తిప్పేందుకు కొత్త కమాండ్లను ప్రయోగిస్తున్నారు. అయితే అది పని చేసే, విజయవంతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని డాడ్ వివరించారు. అక్టోబర్ 15కు చాలా రోజులు ఉండడంతో నాసా కొత్త కమాండ్లను పంపే యత్నం చేస్తోందని చెప్పారు. 


JPL వాయేగర్ వ్యోమనౌకను నిర్మించి, నిర్వహిస్తుంది. ఆ తరువాత  మిషన్లు NASA హీలియోఫిజిక్స్ సిస్టమ్ అబ్జర్వేటరీలో భాగంగా ఉన్నాయి. 2018లో వాయేగర్-2 సూర్యుడి అయస్కాంత క్షేత్రం హీలియోస్పియర్ దాటిపోయింది. ప్రస్తుతం నక్షత్రాల మధ్య ప్రయాణిస్తోంది. సౌర వ్యవస్థను దాటి వెళ్లే ముందు బృహస్పతి, శని గ్రహాలను అణ్వేశించింది. అలాగే యూరేనస్, నెప్ట్యూలను సందర్శించిన తొలి అంతరిక్ష నౌకగా నిలిచింది.  


వాయేజర్ 1  2012లో ఇంటర్‌స్టెల్లార్ మాధ్యమంలోకి ప్రవేశించిన మొట్టమొదటి అంతరిక్ష నౌక. ప్రస్తుతం భూమికి దాదాపు 15 బిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఇక వాయేగర్ అంతరిక్ష నౌకలు రెండూ "గోల్డెన్ రికార్డ్స్" 12 అంగుళాల బంగారు పూతతో కూడిన రాగి డిస్క్‌లు తీసుకెళ్లాయి. మన ప్రపంచం గురించి గ్రహాంతరవాసులకు తెలియజేయడానికి వీటిని పంపారు.


వీటిలో మన సౌర వ్యవస్థ మ్యాప్, రేడియోధార్మిక గడియారంలా పని చేసే యురేనియం ముక్క, గ్రహీతలను, స్పేస్‌ షిప్ ప్రయోగ తేదీని తెలుసుకోవడానికి, రికార్డ్‌ను ఎలా ప్లే చేయాలో తెలియజేసే సింబాలిక్ సూచనలు ఉన్నాయి. దిగ్గజ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ అధ్యక్షతన ఒక కమిటీ NASA కోసం రికార్డులతో కూడిన కంటెంటెన్‌ను ఎంపిక చేసింది. అందులో భూమిపై జీవితాలను వివరించే చిత్రాలు, సంగీతం శబ్దాలు ఉన్నాయి. 


ప్రస్తుతం వాయేగర్లు సాంకేతిక, శాస్త్రీయ సమాచారాన్ని చేరవేస్తున్నాయి. 2025 తరువాత వాటిలోని శక్తి సామర్థ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆ తరువాత అవి పాలపుంతలో నిశబ్ధంగా తిరుగుతూ ఉంటాయి.