NASA SpaceX Crew 10 Launch : ఎలోన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ శనివారం ఉదయం 4:33 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ-10 మిషన్‌ను పంపించింది. నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు ఈ క్రూ-10 మిషన్ లాంచ్ చేశారు. మరికొందరు వ్యోమగాములను ISSకి తీసుకువెళుతోందీ మిషన్. ఇప్పుడు వెళ్లిన వాళ్లంతా క్రూ-9 స్థానంలో ఉన్న వారిని రీప్లేస్ చేస్తారు. వారితోపాటు ఎనిమిది నెలలకుపైగా అంతరిక్షంలో చిక్కుకున్న NASA వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ను భూమిపైకి తీసుకొస్తారు.
ఊహించని విధంగా అంతరిక్షంలో ఎక్కువ కాలం చిక్కుకున్న విలియమ్స్, విల్మోర్‌ను భూమికి తీసుకురావడంలో ఈ మిషన్ చాలా కీలక పాత్ర పోషించనుంది. NASA అండ్ SpaceX శుక్రవారం (స్థానిక సమయం) కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-10 రాకెట్‌తో డ్రాగన్ అంతరిక్ష నౌకను ప్రయోగించాయి.
క్రూ-9 ISSలో తన పనిని పూర్తి చేసిందని, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఆర్బిటింగ్ ప్రయోగశాలలో ఎక్కువ కాలం గడిపారని ఇటీవల నాసా పేర్కొంది. ఈ సమయంలో 150 ప్రత్యేకమైన శాస్త్రీయ ప్రయోగాలు చేసినట్టు వెల్లడించారు. 900 గంటలకుపైగా వారి పరిశోధనల్లో నిమగ్నమయ్యారని తెలిపింది. ప్రయోగాలు పూర్తి చేసిన విలియమ్స్, విల్మోర్ గతేడాది సెప్టెంబర్‌లో నుంచి తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ అది వీలుకాలేదు. దీంతో వారు మరికొంత కాలం ఐఎస్‌ఎస్‌లో ఉండాల్సి వచ్చింది.
బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా విలియమ్స్, విల్మోర్ జూన్ 2024లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ మిషన్ దాదాపు ఎనిమిది రోజుల్లోనే పూర్తి అవుతుందని ప్లాన్ చేసుకున్నారు. కానీ స్టార్‌లైనర్ సరిగా పని చేయకపోవడంతో ఆ గడువు పొడిగిస్తూ వచ్చారు. ముందు నాలుగు నెలలు అనుకున్నారు. కానీ ఇంకా ఆ గడువు పెంచుతూ వచ్చారు. నాసా తన సిబ్బంది లేకుండానే అంతరిక్ష నౌకను తిరిగి తీసుకురావాలని భావించారు. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్‌లైనర్ నిలిచిపోయింది. ఇప్పుడు నాసా స్పేస్‌ఎక్స్ క్రూ ద్వారా డ్రాగన్ అంతరిక్ష నౌకలోని వ్యోమగాములను తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు.