మార్స్‌ గ్రహంపై సంచలనం సృష్టించింది అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా. అంగారకుడిపై ఆక్సిజన్‌ కోసం ప్రయోగించిన మిషన్‌లో కీలక ఘట్టం పూర్తిచేసింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌లోని మోక్సీ ప‌రిక‌రం ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగినట్టు నాసా ప్రకటించింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌లోని మెక్సీ ప‌రిక‌రం ద్వారా.. మార్స్ గ్ర‌హంపై ఉన్న కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను విజ‌య‌వంతంగా ఆక్సిజ‌న్‌గా మార్చింది. మైక్రోఓవెన్ సైజులో ఉన్న‌ మార్స్ ఆక్సిజ‌న్ ఇన్ సిటు రిసోర్స్ యుటిలైజేష‌న్ ఎక్స్‌ప‌రిమెంట్ ప‌రిక‌రం... 16వ సారి ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసింది. అంగారకుడిపై ఇక ఊపిరిపీల్చుకోవచ్చని చాటింది.


2021లో అంగారకుడిపై అడుగుపెట్టినప్పటి నుంచి MOXIE మొత్తం 122 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసిందని నాసా ప్రకటించింది. ఇది ఒక చిన్న కుక్కపిల్ల 10 గంటల పాటు శ్వాసించే దానికి సమానమని తెలిపింది. ఆ ఆక్సిజన్‌ను పరీక్షించగా.. 98 శాతం స్వచ్ఛంగా ఉన్నట్టు తెలిపింది. ఇది నాసా నిర్దేశించిన లక్ష్యం కంటే రెట్టింపు అని తెలిపింది. అక్కడి వాతావరణంలో ఒక్కొక్క కార్బన్‌ అణువును తీసుకుని ఆక్సిజన్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేస్తోంది. ఈ పరికరం కార్బన్‌ డయాక్సైడ్‌ నుంచి ఆక్సిజన్‌ను వేరు చేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషించింది. గంటకు 12 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలిగిందని తెలిపింది నాసా. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో అంగారకుడిపై వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్‌ అందించేందుకు మార్గం సుగ‌మం అవుతుందని ట్వీట్‌ చేసింది. 


మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITచే అభివృద్ధి చేయబడింది మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్ MOXIE. దీని అద్భుతమైన పనితీరుతో అంగారకుడి వాతావరణం నుంచి ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయడం సాధ్యమైందని NASA డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ తెలిపారు. ఇది చంద్రుడు, అంగారక గ్రహంపై వనరులను ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం... దీర్ఘకాలిక చంద్ర ఉనికిని నిర్మించడానికి, బలమైన చంద్ర ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి, అంగారక గ్రహంపై అన్వేషణకు చేసే ప్రయోగాలు ముందుకు సాగేందుకు ఇది చాలా కీలకమని చెప్పారు.