NASA Artemis 1 : అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. చంద్రుడి కక్ష్యలోకి ప్రయోగించే ఆర్టెమిస్-1 ఇంజిన్ లో హైడ్రోజన్ లీక్ కావటంతో లాంఛింగ్ ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఆర్టిమెస్-1 బృందం సాంకేతిక సమస్యపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించిన నాసా తదుపరి లాంఛింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. చంద్రుడి దక్షిణ ధృవంపైకి మనుషులను పంపించాలని మూడు దశలుగా నాసా చేప్టటిన ఆర్టెమిస్ ప్రాజెక్ట్ లో సోమవారం ఆర్టెమిస్-1 చంద్రుడి కక్ష్యలోకి వెళ్లాల్సి ఉంది. ఈ రోజు లాంఛింగ్ నిలిచిపోవటంతో తిరిగి సెప్టెంబర్ 2 లేదా 5 వ తేదీలో నాసా తిరిగి ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
లాంచ్ పాడ్ పై పిడుగు
ఆర్టెమిస్-1 రాకెట్‌లో ఇంధన లీకేజ్ వల్ల ప్రయోగాన్ని నిలిపివేశాం. రాకెట్‌లో 10 లక్షల గ్యాలన్ల హైడ్రోజన్, ఆక్సిజన్ నింపాల్సి ఉంది. లీకేజి వల్ల ఈ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఇంజిన్ నంబర్-3లో సమస్య వల్ల రాకెట్ లాంఛ్‌ను వాయిదా వేశాం. రాకెట్ ఉన్న చోట లాంచ్‌పాడ్‌పై పిడుగులు పడ్డాయి. దీంతో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఆర్టెమిస్-1 ప్రయోగం
2025 నాటి కల్లా చంద్రుడి మీద ఉన్న సౌత్ పోల్ మీదకు మనిషిని చేర్చటమే ఆర్టిమెస్ మిషన్ లక్ష్యం. అందుకే దాదాపు యాభై ఏళ్ల తర్వాత మళ్లీ నాసా ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ను చేపట్టింది. చంద్రుడి మీద స్థావరాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, అక్కడి నుంచి మార్స్ సహా అనేక అంతరిక్ష పరిశోధనలు చేసేందుకు వీలవుతుంది. అదే నాసా ప్లాన్.
ఆర్టెమిస్ అంటే
ముందుగా ఆర్టెమిస్ అంటే ఓ గ్రీకు దేవత. ఇంతకు ముందు నాసా చంద్రుడి మీదకు ప్రయోగాలు చేసిన ప్రాజెక్ట్ పేరు అపోలో. ఆ అపోలోకు ఈ ఆర్టెమిస్ గ్రీకు పురాణాల ప్రకారం సోదరి వరుస. సో అందుకే అపోలో తర్వాతి ప్రాజెక్ట్ కు ఆర్టెమిస్ పేరు పెట్టారు. గ్రీకు పురాణాల ప్రకారం చంద్రుడి అధిదేవత కూడా ఆర్టెమిస్. ఆర్టెమిస్ ప్రాజెక్టులో నాసా ది కీలక భాగమైన్పపటికీ మిగతా స్పేస్ ఏజెన్సీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. నాసానే ఈ అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఆర్టెమిస్ లో కీలకంగా వ్యవహరించనున్న ఓరియన్ క్యాప్యూల్స్ నిర్వహణలో కీలకపాత్ర పోషించేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంతే కాదు ఆర్టెమిస్ అకార్డ్స్ పేరుతో మిగిలిన దేశాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావచ్చని ఎప్పుడూ లేని విధంగా నాసా ఓ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది.
ఆర్టెమిస్ లక్ష్యాలు
ఆర్టెమిస్ మెయిన్ టార్గెట్ మనం అనుకున్నట్లు 2025 నాటికి చంద్రుడి మీద ఇప్పటివరకూ వెళ్లని దక్షిణ భాగం మీద మనిషి కాలు మోపించాలని. అంతే కాదు తొలిసారిగా ఓ మహిళను, ఓ నల్లజాతీయుడిని కూడా చంద్రుడి మీదకు పంపించాలనేది ఆర్టెమిస్ లో లక్ష్యాల్లో ఒకటి. మొత్తం మూడు స్టేజ్ ల్లో ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నాసా భావిస్తోంది.
Also Read : NASA Feels ISRO Strong Competitor: ఇండియా చంద్రుడి మీద చేసిన ప్రయోగాలనే నాసా దాటాలనుకుంటుందా ?
Also Read: NASA Artemis 1: నాసా ఆర్టెమిస్ 1లో మనుషులని ఎందుకు పంపట్లేదు - 2&3 దశలలో ఏం చేస్తారు ?