యాభై ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపిస్తున్న నాసా. ఆర్టెమిస్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే ఆర్టెమిస్ 1 సక్సెస్ అయ్యింది. ఓరియన్ క్యాప్యూల్ చంద్రుడి ని ఓ చుట్టు వచ్చి సేఫ్ గా మళ్లీ భూమిపై ల్యాండ్ అయ్యింది. ఇప్పుడు ఆర్టెమిస్ 2 కోసం SLS రాకెట్ తో పాటు నలుగురు ఆస్ట్రోనాట్లను పంపించనుంది. ఈ నలుగురు ఆస్ట్రోనాట్లు ఓరియన్ క్యాప్య్సూల్ లో చంద్రుడి చుట్టూ ఓ ప్రదక్షిణం చేసి భూమికి చేరుకోనున్నారు. నాసా అత్యంత ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 లో చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనున్న ఆ నలుగురు ఆస్ట్రోనాట్లు ఎవరో సగర్వంగా ప్రకటించింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.


1972లో చివరిసారిగా చంద్రుడిపైన మనిషి అడుగుపెట్టాడు. ఆ తర్వాత నాసా జాబిల్లిపై మనిషిని పంపించే మిషన్స్ ను నాసా నిలిపివేసింది. తిరిగి 50ఏళ్ల తర్వాత నలుగురు మనుషులు చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి జాబిల్లి చుట్టూ ఓ రౌండ్ తిరిగి రానున్నారు. ఆ నలుగురు ఆస్ట్రోనాట్లు ఎవరంటే..




1. Christina Koch(USA)
ఆర్టెమిస్ 2 క్రూలో మొదటి సభ్యురాలు ఈమె. అంతే కాదు చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనున్న మొదటి మహిళ. నాసా గొడార్డ్ లో ఎలక్ట్రికల్ ఇంజినీర్ గా తన కెరీర్ ప్రారంభఇంచిన క్రిస్టీనా కౌచ్...ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పనిచేశారు. 2019లో సహచర మహిళా ఆస్ట్రోనాట్లతో కలిసి స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆర్టెమిస్ 2 లో మిషన్ స్పెషలిస్ట్ గా క్రిస్టీనా కౌచ్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టీనా కౌచ్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది.


2.Jeremy R. Hansen(CANADA)
ఈ ఆర్టెమిస్ 2 కోసం నాసా తో పాటు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కూడా పనిచేస్తోంది. అందుకని కెనడాకు చెందిన జెర్మీ ఆర్ హేన్సన్ కి కూడా చంద్రుడి కక్ష్యలోకి వెళ్లే అవకాశం దక్కింది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి కెనడియన్ ఆస్ట్రోనాట్, ఫస్ట్ నాన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ హేన్సనే. ఫైటర్ పైలెట్ అయిన హేన్సన్...ఆర్టెమిస్ 2 మిషన్ ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరించనున్నాడు.


3.Victor Glover(USA)
విక్టర్ గ్లోవర్ ఓ ఫైటర్ పైలెట్. నలభై వేర్వేరు ఎయిర్ క్రాఫ్టులను మూడు వేల పని గంటలు నడిపిన అనుభవం విక్టర్ గ్లోవర్ సొంతం. స్పేస్ ఎక్స్ తో నాసా ప్రయోగించిన క్రూ వన్ మిషన్ కు విక్టర్ గ్లోవరే పైలెట్. ఇప్పుడు ఆర్టెమిస్ 2 మిషన్ కు పైలెట్ గా విక్టర్ గ్లోవర్ వ్యవహరించనున్నారు. 


4.Reid Wiseman(USA)
రీడ్ వైస్ మన్ ..ఈ ఆర్టెమిస్ 2 మిషన్ కి కమాండర్. చంద్రుడి చుట్టూ ఓ చుట్టు చుట్టి వచ్చే ఓరియన్ క్యాప్యూల్స్ కి నాయకుడిగా వ్యవహరించనున్నారు. ఈయన ఆస్ట్రోనాటే కాదు ఆక్వానాట్ కూడా.. సముద్ర గర్భంలోనూ పని చేసిన అనుభవం రీడ్ వైస్ మన్ సొంతం. 2014 లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఫ్లైట్ ఇంజినీర్ గా పనిచేసిన రీడ్ వైస్మన్...నీమో21 అండర్ సీ రీసెర్చ్ మిషన్ కు ప్రస్తుతం కమాండర్ గా ఉన్నారు. ఇకపై ఆర్టెమిస్ 2 బాధ్యతలను చూసుకోనున్నారు.


ఈ నలుగురు యాభై ఏళ్ల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనున్న నలుగురు ఆస్ట్రోనాట్లుగా చరిత్ర సృష్టించనుండగా... వీరి నలుగురి కుటుంబసభ్యులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు. అమెరికా గౌరవాన్ని, ప్రపంచ మానవాళి శక్తిని చాటే విధంగా భవిష్యత్తు స్పేస్ పరిశోధనలకు, అంతరిక్ష ప్రయాణాలకు ఈ నలుగురు నాందిపలకనున్నారని ప్రశంసించారు. వాళ్ల కుటుంబసభ్యులతోనూ జో బిడైన్ ముచ్చటించారు.