English Ban In Italy: ప్ర‌పంచ‌మంతా విద్య‌, ఉద్యోగాల్లో ఇంగ్లీష్ అవసరం, స‌మాచార మార్పిడికి ఆంగ్ల భాష వినియోగం త‌ప్ప‌నిస‌రిగా మారిన ఈ రోజుల్లో ఇట‌లీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప‌నిచేసే చాట్‌ జీపీటీని నిషేధించిన ఇటలీ ప్రస్తుతం ఆంగ్ల భాషపై దృష్టి కేంద్రీకరించింది. అధికారిక వ్యవహారాల్లో ఆంగ్ల భాషను పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇటలీకి చెందిన ఏ వ్యక్తి అయినా ఇటాలియన్ భాష కాకుండా ఇతర భాషలు ఉపయోగిస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అందుకోసం ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. ఇంగ్లీష్ వాడకాన్ని పూర్తిగా లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇటలీపై విమర్శలు వస్తున్నాయి.


ఈ మేరకు ఇటలీ ప్రధానమంత్రి, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం ప్రకారం స్థానికులు మాట్లాడేటప్పుడు విదేశీ పదాలను ఉపయోగిస్తే ఐదు వేల యూరోల నుంచి లక్ష యూరోలు (మ‌న క‌రెన్సీలో దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.82 లక్షలు) వరకు జరిమానా విధిస్తారు. ఈ బిల్లును ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ఆ దేశ పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. దీనికి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు.


ఇంగ్లిష్ భాష మీద ప్రజలకు ఉన్న వ్యామోహాన్ని తొలగించడానికి.. తమ భాషను కాపాడుకోవడానికి ఇటలీ ఈ బిల్లును తెచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పదవుల్లో ఉన్న అధికారులు నేతలు ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని ఇటలీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ చట్టం ద్వారా అన్ని విదేశీ భాషలు చేర్చబడినప్పటికీ ప్రధానంగా “ఆంగ్లోమానియా” లేదా ఇంగ్లిష్ పదాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. 


ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం ఇటాలియన్ భాష ప్రాధాన్యాన్ని పెంచడమేనని ప్ర‌భుత్వం వెల్లడించింది. ఈ బిల్లు ప్రకారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదవిని కలిగి ఉన్న ఎవరైనా కూడా “రాతపూర్వకంగా, మౌఖికంగా, ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఇది అధికారిక పత్రాలలో స్థానిక వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఎక్రోనింస్, పేర్లను కూడా ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీలకు అన్ని అంతర్గత విధానాలు, ఉపాధి ఒప్పందాల కోసం ఇటాలియన్-భాష వెర్షన్‌లు అవసరం కానున్నాయి.


తమ భాషను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటలీ దేశ ప్రతినిధులు చెబుతున్నారు. ఆంగ్ల భాష మొత్తం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆర్టికల్‌ 1 ప్రకారం.. అన్ని కార్యాలయాల్లో, విదేశీయులతో మాట్లాడేటప్పుడు కూడా ప్రాథమిక భాషగా ఇటాలియన్‌ను ఉపయోగించాలి. ఆర్టికల్‌ 2 ప్రకారం.. దేశంలో వస్తుసేవల ప్రచారం కోసం ఇటాలియన్‌ భాష తప్పనిసరి.


వ్యాపార సంబంధ లావాదేవీల్లో అధికారిక డాక్యుమెంట్లలో ఇటాలియన్ భాషను ప్ర‌భుత్వం తప్పనిసరి చేసింది. ఆంగ్ల పదాల వాడకంపై పూర్తి నిషేధాన్ని విధించింది. ఇటాలియన్ భాష రాని విదేశీయులతో మాట్లాడేటప్పుడు కూడా ఇటాలియన్ భాషనే వాడాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం బిల్లు రూపంలో ఉన్న దీన్ని పార్లమెంటు ఆమోదం అనంతరం పూర్తి స్థాయి చట్టంగా మార్చనున్నారు. ఆ తర్వాత దీన్ని అమలు చేయనున్నారు.